Begin typing your search above and press return to search.

ఇది ఫిక్స్.. బాహుబలి-2నే నెంబర్ వన్

By:  Tupaki Desk   |   22 Oct 2017 7:36 AM GMT
ఇది ఫిక్స్.. బాహుబలి-2నే నెంబర్ వన్
X
అవ్వడానికి తెలుగు సినిమానే అయినా.. దేశవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించేసింది ‘బాహుబలి: ది కంక్లూజన్’. భాషతో సంబంధం లేకుండా.. ప్రాంతంతో సంబంధం లేకుండా ఈ సినిమా దేశమంతటా వసూళ్ల మోత మోగించింది. బాలీవుడ్లో సైతం ఈ సినిమా అన్ని కలెక్షన్ల రికార్డులనూ బద్దలు కొట్టేసింది. తొలి రోజు వసూళ్ల నుంచి ఓవరాల్ కలెక్షన్ల వరకు అన్ని రికార్డులూ ‘బాహుబలి-2’ సొంతమయ్యాయి. ‘బాహుబలి-2’ను కొట్టేస్తాయనుకున్న భారీ హిందీ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేశాయి. సల్మాన్ ఖాన్ సినిమా ‘ట్యూబ్ లైట్’.. షారుఖ్ ఖాన్ మూవీ ‘జబ్ హ్యారీ మెట్ సెజాల్’ దారుణమైన ఫలితాలనందుకున్నాయి. బాహుబలి-2 వసూళ్లకు ఇవి దరిదాపుల్లో కూడా లేవు.

కొత్త సినిమా ‘గోల్ మాల్ అగైన్’ అయినా ‘బాహుబలి-2’ను దాటుతుందనుకుంటే అది కూడా ‘బాహుబలి’కి దగ్గరగా వెళ్లలేకపోయింది. ఈ చిత్రం తొలి రోజు దేశవ్యాప్తంగా రూ.30.14 కోట్లు వసూలు చేసింది. బాహుబలి-2 హిందీ వెర్షన్ తొలి రోజు రూ.41 కోట్లు కొల్లగొట్టింది. ‘గోల్ మాల్ అగైన్’ రెండో స్థానంలో నిలిచింది. ట్యూబ్ లైట్ రూ.21.15 కోట్లు.. రయీస్ రూ.20.42 కోట్లు.. జుడ్వా-2 రూ.16.10 కోట్లతో తర్వాతి మూడు స్థానాలు సాధించాయి. ‘గోల్ మాల్ అగైన్’ తర్వాత ఈ ఏడాది హిందీలో చెప్పుకోదగ్గ భారీ సినిమాలేవీ లేవు. కాబట్టి ‘బాహుబలి-2’ రికార్డు పదిలమనే అనుకోవాలి. దాన్ని కొట్టే సినిమా ఈ ఏడాది రాబోదనే చెప్పాలి.