బాహుబలి 1500.. దంగల్ 500

Fri May 19 2017 16:23:23 GMT+0530 (IST)

ఓవైపు ‘బాహుబలి: ది కంక్లూజన్’.. మరోవైపు ‘దంగల్’.. ప్రపంచ స్థాయిలో ఇండియన్ సినిమా పేరు మార్మోగిపోయేలా చేస్తున్నాయి. ‘బాహుబలి-2’ మీద ముందు నుంచే భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా రూ.1000 కోట్లు వసూలు చేసిన తొలి భారతీయ సినిమాగా రికార్డు సృష్టిస్తుందన్నది అందరూ ఊహించిన విషయమే. ఐతే బాహుబలి-2 అంచనాల్ని మించిపోయింది. ఫుల్ రన్లో కాదు.. తొలి వారంలోనే రూ.1000 కోట్ల మార్కును దాటేసింది. రూ.1500 కోట్ల మార్కు మీద కన్నేసింది. నిజంగా ఈ మైలురాయి అందుకుంటుందా అన్న సందేహాలకు తెరదించుతూ.. ఆ మైలురాయిని కూడా దాటేసింది బాహుబలి-2. శుక్రవారం.. అంటే విడుదలైన 22వ రోజు ‘బాహుబలి: ది కంక్లూజన్’ వరల్డ్ వైడ్ రూ.1500 కోట్ల గ్రాస్ వసూళ్ల మార్కును అందుకుంది.

ఐతే ప్రపంచవ్యాప్తంగా బాహుబలి-2 సాగిస్తున్న ప్రభంజనం కంటే.. చైనాలో అమీర్ ఖాన్ సినిమా ‘దంగల్’ సృష్టిస్తున్న ప్రకంపనల గురించి ఇంకా ఎక్కువగా చెప్పుకోవాలి. ఇండియాలో రిలీజైన నాలుగు నెలల తర్వాత చైనాలో విడుదలైన ఈ చిత్రం.. రెండు వారాల్లోనే ఏకంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. ఇప్పటిదాకా ఈ చిత్రం చైనాలో 78 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేయడం అనూహ్యం. వీకెండ్లలోనే కాదు.. వీక్ డేస్ లో కూడా ‘దంగల్’ ప్రభంజనం సాగిస్తోంది. సోమవారం నుంచి గురువారం వరకు నాలుగు రోజుల్లో ఈ సినిమా 16 మిలియన్ డాలర్లు వసూలు చేయడం విశేషం. ‘దంగల్’ ఓపెనింగ్స్ ఎంత బావున్నప్పటికీ మహా అయితే రూ.200 కోట్లు వసూలు చేస్తే ఎక్కువ అనుకున్నారు. కానీ అక్కడ చైనా సినిమాల్ని కూడా పక్కకు నెట్టేసి ప్రభంజనాన్ని కొనసాగిస్తూ ఏకంగా రూ.500 కోట్ల మార్కునే అందుకుందీ సినిమా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/