Begin typing your search above and press return to search.

‘క్షణం’ని ఎలా తయారు చేసి పెట్టారంటే..

By:  Tupaki Desk   |   21 Feb 2018 11:55 AM GMT
‘క్షణం’ని ఎలా తయారు చేసి పెట్టారంటే..
X
రెండేళ్ల కిందట తెలుగులో సంచలన విజయం సాధించిన సినిమా ‘క్షణం’. తెలుగులో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్లలో దీన్ని ఒకటిగా చెప్పొచ్చు. ఈ చిత్రం ఇప్పటికే తమిళంలో ‘సత్య’ పేరుతో అనువాదమై అక్కడి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ‘క్షణం’ హిందీ రీమేక్ హక్కుల్ని ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా తీసుకున్నాడని.. సల్మాన్ ఖాన్ హీరోగా ఈ చిత్రాన్ని పునర్నిర్మిస్తారని ప్రచారం జరిగింది. కానీ కట్ చేస్తే.. ఈ రోజు విడుదలైన ‘బాగి-2’ ట్రైలర్లో ‘క్షణం’ ఛాయలు అక్కడక్కడా కనిపించాయి. ఈ చిత్ర మూల కథను మాత్రమే తీసుకుని.. టైగర్ శైలికి తగ్గట్లుగా యాక్షన్ తో కుమ్మేసినట్లున్నారు ట్రైలర్ చూస్తుంటే.

రెండు నిమిషాలకు పైగా సాగే ఈ ట్రైలర్ చూస్తే దీనికి కథ పరంగా ‘క్షణం’ స్ఫూర్తి ఉన్నట్లు కనిపిస్తుంది కానీ.. నరేషన్లో మాత్రం ఆ ఛాయలు ఎంతమాత్రం లేవు. ‘బాగి’ స్టయిల్లోనే దీంట్లో టన్నులు టన్నులుగా యాక్షన్ దట్టించారు. ‘క్షణం’ కథే ప్రధానంగా.. ఇంటెలిజెంట్ గా సాగితే.. ఇక్కడ మాత్రం యాక్షన్ తప్ప ఇంకేమీ కనిపించట్లేదు. హీరో ఒక కొండ మీది నుంచి హెలికాఫ్టర్ మీదికి దూకేసి దాన్ని కూల్చేస్తాడంటే ఈ సినిమా ఎలా నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఆ ఒక్క షాట్ మాత్రమే కాదు.. ట్రైలర్లో 80 శాతం యాక్షన్ సన్నివేశాలు తప్ప ఇంకేమీ లేవు. ఈమాత్రం దానికి ‘క్షణం’ సినిమానే రీమేక్ చేయాల్సిన అవసరమేంటో అర్థం కాని విషయం. టైగర్ ష్రాఫ్-దిశా పటాని జంటగా నటించిన ఈ చిత్రంలో రణదీప్ హుడా.. మనోజ్ బాజ్ పేయి కీలక పాత్రల్లో నటించారు. ‘బాగి’ తీసిన అహ్మద్ ఖానే ఈ చిత్రాన్ని కూడా రూపొందించాడు. మార్చి 30న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.