Begin typing your search above and press return to search.

అఖిల్ నిర్మాతకు భలే ఆఫర్

By:  Tupaki Desk   |   21 July 2018 6:19 AM GMT
అఖిల్ నిర్మాతకు భలే ఆఫర్
X
నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్న నిర్మాతలు ఎందరో ఉన్నారు. పెట్టిన ఖర్చు వెనక్కు రావడానికి ఉన్న మార్గం వసూళ్లు ప్లస్ హక్కులు. అంతకు మించి వేరే మార్గం ఉండదు. కానీ నిర్మాత బివిఎస్ ఎన్ ప్రసాద్ కు మాత్రం ధనలక్ష్మి లండన్ ప్రభుత్వం రూపంలో తలుపు తట్టింది. అదెలా అంటారా. చూద్దాం. తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ మూడో సినిమా నిర్మిస్తున్న ప్రసాద్ గారి టీమ్ ప్రస్తుతం దాని షూటింగ్ కోసం గత కొంత కాలంగా లండన్ లో మకాం వేసిన సంగతి తెలిసిందే. కథలో కీలక భాగం అక్కడే జరగాల్సి ఉండటంతో భారీ వ్యయంతో అది కొనసాగిస్తున్నారు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం లండన్ పార్ట్ కే 20 కోట్ల దాకా బడ్జెట్ అవుతోందట. వామ్మో అంతనా అనిపించడం సహజం. కానీ లండన్ ప్రభుత్వం నుంచి వచ్చిన తీయని కబురు ప్రసాద్ ని గట్టెక్కిస్తోంది.

తమ దేశంలో షూటింగ్ జరుపుకునే విదేశీ సినిమాలకు అందుకు అయ్యే బడ్జెట్ లో సగం అంటే 50 శాతం రీ ఫండ్ చేసే విధంగా అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అంటే ప్రసాద్ గారు పెడుతున్న దాంట్లో 10 కోట్లు అధికారికంగానే వెనక్కు వస్తుందట. రెండు చిన్న సినిమాలు తీసేంత మొత్తం వచ్చి పడటం అంటే మాటలు కాదుగా. ఇది ఖచ్చితంగా నిర్మాతకు మేలు చేసేదే. ఇలాంటి వెసులుబాటు ఇప్పుడు వచ్చింది కాదు. గతంలో ప్రసాద్ గారే నిర్మించిన నాన్నకు ప్రేమతో తొలిప్రేమ సినిమాలకు కూడా వచ్చింది కానీ మరీ 50 శాతం కాదట. అందుకే అఖిల్ మూవీకి ఇంతేసి మొత్తం రావడం పట్ల మహా ఆనందంగా ఉన్నారు ప్రసాద్. అక్కడ షెడ్యూల్ పూర్తయ్యాక హైదరాబాద్ లో జరిగే బాలన్స్ తో షూటింగ్ పూర్తయిపోతుంది. మిస్టర్ మజ్ను అనే టైటిల్ పరిశీలనలో ఉండగా దాన్ని మార్చే ఆలోచనలో ఉంది టీమ్.