Begin typing your search above and press return to search.

ఈ దర్శకుడి భవితవ్యం ఏమిటి?

By:  Tupaki Desk   |   10 Dec 2017 5:30 PM GMT
ఈ దర్శకుడి భవితవ్యం ఏమిటి?
X
రైటర్లందరూ ఈజీగా దర్శకులైపోతున్నారు ఈ మధ్య. అందులో చాలామంది సక్సెస్ అవుతున్న వాళ్లే. ఇప్పుడు దర్శకుడు కావడానికి అతి దగ్గర దారి కూడా ముందు రైటర్ గా పేరు తెచ్చుకోవడమే. త్రివిక్రమ్ శ్రీనివాస్.. కొరటాల శ్రీనివాస్ లాంటి వాళ్లు ముందు రైటర్లుగానే తెలుగు తెరకు పరిచయమయ్యారు. దర్శకులుగా ప్రస్తుతం వాళ్ల స్థాయి ఏంటన్నది కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఐతే రచయితగా అపారమైన అనుభవం.. గొప్ప ట్రాక్ రికార్డు ఉన్నప్పటికీ బి.వి.ఎస్.రవి మాత్రం దర్శకుడిగా తన తొలి సినిమాతో ఆశించిన ఫలితాలన్నందుకోలేకపోయాడు. గోపీచంద్ హీరోగా అతను తీసిన ‘వాంటెడ్’ అతడికి చేదు అనుభవాన్ని మిగిల్చింది.

‘వాంటెడ్’ దెబ్బకు దర్శకుడిగా మళ్లీ ఇంకో సినిమా చేయడానికి రవికి ఆరేళ్లు పట్టింది. చివరికి సాయిధరమ్ తేజ్ హీరోగా ‘జవాన్’ రూపొందించాడతను. ఈ సినిమాకు చాలామంది మంచి బ్యాకప్ ఇచ్చారు. దిల్ రాజు అండ దొరికింది. కొరటాల శివ.. హరీష్ శంకర్ లాంటి పెద్ద దర్శకులు సపోర్ట్ చేశారు. సినిమా పూర్తయ్యాక కూడా మార్పులు చేర్పులు చేసి.. దీన్ని ఎలాగైనా హిట్ చేయాలన్న కసి అందరిలోనూ కనిపించింది. ఐతే రవికి హిట్టివ్వాలని ఇంతమంది చేసిన ప్రయత్నం ఫలించలేదు. ‘జవాన్’ చేదు అనుభవాన్నే మిగిల్చింది. దీనికి టాక్.. ఓపెనింగ్స్ బాగానే ఉన్నా.. వీకెండ్ తర్వాత ఇది నిలవలేకపోయింది. ‘జవాన్’ తన కెరీర్ కు ఎంత ముఖ్యమో విడుదలకు ముందే చెప్పాడు రవి. ఈ సినిమా ఆడితే పది మంది సినిమా చేయమని తన దగ్గరికి వస్తారని.. లేదంటే తాను పది మంది వెనుక తిరగాల్సి ఉంటుందని చెప్పాడు. ఇప్పుడు ‘జవాన్’ చూస్తే చివరికి ఫ్లాప్ అనిపించుకునేలాగే ఉన్న నేపథ్యంలో రవి భవిత్యం ఏంటో చూడాలి. అతను అన్నట్లే తర్వాతి సినిమా కోసం ఇప్పుడు నిర్మాతల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. మరి రవికి ఇంకో ఛాన్స్ ఇచ్చేవాళ్లెవ్వరో?