Begin typing your search above and press return to search.

దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్.. పోస్ట‌ర్ పై కొత్త పేరు

By:  Tupaki Desk   |   29 Aug 2016 7:30 PM GMT
దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్.. పోస్ట‌ర్ పై కొత్త పేరు
X
తెలుగు సినిమాల స్థాయి ఈ మ‌ధ్య కాలంలో బాగా పెరిగింది. బాలీవుడ్ సినిమాల‌కు దీటుగా బ‌డ్జెట్లు పెరుగుతున్నాయి. బిజినెస్ కూడా అలాగే జ‌రుగుతోంది. సినిమా బాగుంటే క‌లెక్ష‌న్లు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. ఈ నేప‌థ్యంలోనే సినిమాల‌కు టెక్నీషియ‌న్లను ఎంచుకునే విష‌యంలోనూ మ‌నోళ్లు అస్స‌లు రాజీ ప‌డ‌ట్లేదు. టాప్ టెక్నీషియ‌న్లను మ‌న సినిమాల్లోకి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా సినిమాకు అత్యంత కీల‌క‌మైన సినిమాటోగ్ర‌ఫీ విష‌యంలో మ‌న ద‌ర్శ‌కులు కొత్త అనుభూతిని పంచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. పూరి జ‌గ‌న్నాథ్‌.. కొర‌టాల శివ లాంటి ద‌ర్శ‌కులు వేరే భాష‌ల నుంచి మంచి మంచి కెమెరామ‌న్ల‌ను తీసుకొచ్చారు.

తాజాగా హ‌రీష్ శంక‌ర్ సైతం ఓ టాలెంటెడ్ సినిమాటోగ్రాఫ‌ర్ ను తెలుగు సినిమాకు ప‌రిచ‌యం చేయ‌బోతున్నాడు. హ‌రీష్‌-అల్లు అర్జున్ కాంబినేష‌న్లో రాబోయే ‘దువ్వాడ జ‌గ‌న్నాథమ్‌’ సినిమా పోస్ట‌ర్ మీద గ‌మ‌నిస్తే ఆయాన‌క బోస్ అనే పేరు చూడొచ్చు. దోస్తానా.. కైట్స్.. స్టూడెంట్ ఆఫ్ ద ఇయ‌ర్‌.. కిక్‌.. డిషూమ్ లాంటి బాలీవుడ్ సినిమాల‌కు ప‌నిచేశాడీ సినిమాటోగ్రాఫ‌ర్. బాలీవుడ్లో అత‌డికి చాలా మంచి పేరుంది. ‘దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్’తో అత‌ను టాలీవుడ్ కు ప‌రిచ‌యం కాబోతున్నాడు. అత‌డి ప‌నిత‌నం సినిమాకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ అవుతుంద‌ని అంటున్నారు యూనిట్ స‌భ్యులు. చూద్దాం అత‌డి టాలెంట్ ఏంటో? ‘దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్’కు అత‌ను ఎలాంటి లుక్ తీసుకొస్తాడో?