24 గంటల్లో 29 కోట్ల వ్యూస్

Mon Dec 10 2018 21:58:50 GMT+0530 (IST)

మెరుపుల్లేవ్.. మెరిపించడాల్లేవ్.. అసలు విజువల్ గ్లింప్స్ అని చెప్పుకోవడానికి ఏదీ లేదు. వీఎఫ్ ఎక్స్.. గ్రాఫిక్స్ షాట్స్ అంటూ గొప్ప విజువల్స్ కానీ - అరివీర భయంకర సాహసాలు కానీ ఆ ట్రైలర్ లో లేనే లేవు. అయినా రిలీజైన 24 గంటల్లోనే దాదాపు 29 కోట్ల మంది వీక్షించారు. ఇంకా ఇంకా సంచలనాలు సృష్టిస్తూ యూట్యూబ్ లో దూసుకుపోతోంది.ఇంతకీ ఏ ట్రైలర్ ఇది? అంటే 2019 ఏప్రిల్లో రిలీజ్ కి రెడీ అవుతున్న `అవెంజర్స్ - ఎండ్ గేమ్` ట్రైలర్ గురించే. ఈ ట్రైలర్ రిలీజైన 24 గంటల్లోనే 29 కోట్ల (289 మిలియన్) వ్యూస్ తో సంచలనం సృష్టించింది. దీంతో ఎవెంజర్స్ సిరీస్ కి ఉన్న క్రేజు ఎలాంటిదో అంచనా వేయొచ్చు. ఈ సిరీస్ కి కోటాను కోట్ల మంది అభిమానులు ఉండడం వల్లనే ప్రపంచ రికార్డుల్ని బద్ధలు కొడుతూ ఒక్కో సినిమా వసూళ్ల వేట సాగిస్తున్నాయి. ఇండియా నుంచి మినిమంగా 300కోట్లు ప్రతి సినిమాకి ఖాతాలోకి మళ్లిస్తున్నారు హాలీవుడ్ వాళ్లు. ప్రతిష్ఠాత్మక మార్వల్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ తాజా సీక్వెల్ ని నిర్మిస్తోంది.

రాబర్ట్ డోనీ జూనియర్ - క్రిస్ హేమ్స్ వర్త్ - మార్క్ రఫెలో- క్రిస్ ఇవాన్స్- స్కార్లెట్ జాన్సన్- బెనెడిక్ట్ కమ్ బెర్ బాచ్- టామ్ హాల్యాండ్- చాడ్విక్ బోస్ మేన్ వంటి టాప్ హీరోలు సూపర్ హీరోలుగా నటిస్తున్నారు. జోస్ బ్రోలిన్ థానోస్ పాత్రలో నటిస్తున్నారు. `అవెంజర్స్ - ఎండ్ గేమ్` చిత్రంలో థానోస్ ని నిలువరించేందుకు అవెంజర్స్ ఎలాంటి పోరాటం చేయబోతున్నారు? అన్నది చూపిస్తున్నారట. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు అసలు ఈ సినిమా కథాకమామీషు ఏంటి? అంటూ సామాజిక మాధ్యమాల్లో డిబేట్ రన్ చేయడం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఏప్రిల్ లో కానీ దీనిపై క్లారిటీ రాదేమో? ఆంథోని రస్సో - జో రస్సో సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.