Begin typing your search above and press return to search.

బాబోయ్.. దీపావళి సినిమాలు

By:  Tupaki Desk   |   9 Nov 2018 6:59 AM GMT
బాబోయ్.. దీపావళి సినిమాలు
X
తెలుగువాళ్లకు సంక్రాంతి.. దసరాల తర్వాత పెద్ద పండుగ అంటే దీపావళి. మిగతా రెండు పండగలతో పోలిస్తే ఈ సమయంలో సినిమాల సందడి కొంచెం తక్కువే కానీ.. ఒక మీడియం రేంజ్ సినిమా అయినా రిలీజవుతుండేది ఈ సీజన్లో. కానీ ఈసారి పండగ అడ్వాంటేజీని ఉపయోగించుకునే సినిమానే లేకపోయింది. ముందు వారం వచ్చిన ‘సవ్యసాచి’ వీకెండ్లోనే జోరు చూపించలేకపోయింది. వీకెండ్ తర్వాత సినిమా నిలవలేదు. ఇక ఈ వారం రిలీజైన డైరెక్ట్ తెలుగు సినిమా ‘అదుగో’ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రవిబాబు కెరీర్లోనే అత్యంత చెత్త సినిమాల్లో ఇదొకటిగా చెప్పొచ్చు. అసలే దీనికి బజ్ లేదంటే.. సినిమా టాక్ కూడా దారుణంగా ఉండటంతో జనాలు థియేటర్లకు వెళ్లడానికి భయపడుతున్నారు. దీంతో పాటుగా విడుదలైన రెండు డబ్బింగ్ సినిమాలూ నిరాశ పరిచాయి.

విజయ్ మూవీ ‘సర్కార్’అంచనాల్ని అందుకోలేకపోయింది. విజయ్-మురుగదాస్ కాంబినేషన్ మీద ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గ సినిమా కాదిది. పోటీ లేకపోవడం వల్ల దీనికి వసూళ్లు వస్తున్నాయి కానీ.. సినిమా మాత్రం నిరాశకే గురి చేస్తోంది. ఇక దీపావళి వీకెండ్లో చివరగా వచ్చిన ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ కూడా తుస్సుమనిపించింది. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ సినిమా కదా అని కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. లేక లేక ఆమిర్ సినిమా తెలుగులోనూ రిలీజైందన్న ఆనందమే జనాల్లో కనిపించడం లేదు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు తయారైందీ సినిమా. మొత్తంగా దీపావళికి వచ్చిన మూడు సినిమాలూ తుస్సుమనిపించాయి. ముందు వారాల్లో వచ్చిన సినిమాల కథ ఆల్రెడీ ముగిసిపోగా.. కొత్తవి ఏమాత్రం అలరించేలా లేకపోవడంతో సినీ ప్రియులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.