సూపర్ స్టార్ మూవీ హక్కులకు వేలం పాట

Sun Oct 21 2018 21:47:20 GMT+0530 (IST)

సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ అంటే అంచనాలు ఆకాశంలో ఉంటాయి. ఇక శంకర్ - రజినీకాంత్ ల కాంబో అంటే మాటల్లో చెప్పలేనంత అంచనాలుంటాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రజినీకాంత్ - శంకర్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన ‘2.ఓ’ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాదాపు 550 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం కోసం దాదాపు రెండు సంవత్సరాలుగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. హాలీవుడ్ సినిమాను తలదన్నేలా విజువల్ వండర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.ఈ చిత్రం కోసం అన్ని భాషల్లో - అన్ని ఏరియాల్లో కూడా విపరీతమైన పోటీ ఉంది. ప్రతి ఏరియాలో కూడా ఈ చిత్రం తమకే ఇవ్వాలంటూ పది మంది డిస్ట్రిబ్యూటర్ల వరకు ఎగబడుతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అందుకే ఈ చిత్రం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను వేలం పాట ద్వారా అమ్మాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం అందుతుంది.

సినిమా డిస్ట్రిబ్యూషన్ కావాలనుకునే వారు ముందుగా చిత్ర నిర్మాతకు తెలియజేస్తే - ఏరియాల వారిగా వేలంపాట నిర్వహించి - అందులో ఎక్కువ మొత్తానికి ఎవరు కోట్ చేస్తే వారికి రైట్స్ ను కట్టబెట్టాలని నిర్ణయించారు. మామూలుగా అన్ని సినిమాలకు ఇద్దరు ముగ్గురు పోటీ పడితే ఎవరు ఎక్కువ పెడితే వారికే రైట్స్ ఇస్తారు. అదే విధంగా ఈ చిత్రంకు కూడా జరుగుతుంది. కాని ఇక్కడ పది మంది అంతకు మించి పోటీ పడుతుండగా - వేలం పాటను అందరి ముందే నిర్వహించబోతున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా కనిపించబోతున్న ఈ చిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు ట్రైలర్ సినిమా స్థాయిని అమాంతం పెంచింది. సినిమా రెండు వేల కోట్లకు పైగా వసూళ్లు చేస్తుందనే నమ్మకంను సినీవర్గాల వారు కలిగి ఉన్నారు. మరి ఆ స్థాయిలో సినిమా వసూళ్లు ఉంటాయా లేదా అనేది చూడాలి.