Begin typing your search above and press return to search.

16 కోట్ల బడ్జెటే ఎక్కువనుకున్నా 29 అయింది!

By:  Tupaki Desk   |   19 Sep 2018 8:14 AM GMT
16 కోట్ల బడ్జెటే ఎక్కువనుకున్నా 29 అయింది!
X
ఒక నిర్మాణ సంస్థకు హిట్ చిత్రాలు చాలా రావొచ్చేమో గానీ లాభాలతో పాటు మంచి పేరు తీసుకొచ్చే చిత్రాలు అరుదుగా వస్తాయి. వైజయంతి మూవీస్ బ్యానర్ కు 'మహానటి' అలాంటి మరపురాని చిత్రమే. తెలుగువారి అభిమాన నటి అయిన సావిత్రి బయోపిక్ కావడంతో వైజయంతి వారు.. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమానో ఎంతో బాధ్యతగా తెరకెక్కించారు. ప్రేక్షకుల అభిమానం చూరగొన్నారు. ఇక ఈ సినిమా బడ్జెట్ గురించి అశ్విని దత్ రీసెంట్ గా ఆసక్తికరమైన సంగతులు వెల్లడించారు.

'మహానటి' కి ముందు అనుకున్న బడ్జెట్ వేరని.. ఫైనల్ గా అయింది వేరని చెప్పారు. 'మహానటి' ప్లాన్ చేస్తున్నప్పుడు దత్ గారు వాళ్ళమ్మాయి స్వప్న ను సినిమాకు ఎంత బడ్జెట్ అవుతుందని అడిగారట.. స్వప్న రూ. 16-17 కోట్లు అని చెప్పిందట. అసలు 'మహానటి'కి ఆ బడ్జెటే ఎక్కువని దత్ గారు అనుకున్నారట. ఆ బడ్జెట్ ఎక్కువని అనుకున్నప్పటికీ సావిత్రిగారి సినిమా కాబట్టి సెట్స్.. గ్రాఫిక్స్ విషయంలో రాజీపడకుండా తెరకెక్కించమని చెప్పారట. ఫైనల్ గా ఖర్చు చూస్తే రూ. 29 కోట్లు అయిందట.

సావిత్రిగారి కథను ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కించామని.. ఆ సినిమా తీసిందుకు.. సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ గొప్పగా అనిపించిందని అన్నారు. సినిమా విజయం సాధించడంతో ఆ సంతోషం రెట్టింపయిందట. అసలు ఆ రేంజ్ బడ్జెట్ పెట్టడానికి తమకు ధైర్యం ఎలా వచ్చిందో ఆశ్చర్యం కలిగించే విషయమని అభిప్రాయపడ్డారు. ఏదేమైనా 'మహానటి' తెలుగు సినీ పరిశ్రమలో బయోపిక్స్ కు ఒక బెంచ్ మార్క్ ఏర్పరిచింది అనడంలో సందేహం లేదు.