అతనిచేతిలో అర్జున్ రెడ్డి రీమేక్!

Tue Feb 12 2019 10:40:51 GMT+0530 (IST)

'అర్జున్ రెడ్డి' తమిళ రీమేక్ 'వర్మ' షూటింగ్ అంతా పూర్తయిన తర్వాత నిర్మాతలు సినిమాను స్క్రాప్ చేసిన సంగతి తెలిసిందే.  'వర్మ' ను మళ్ళీ ఫ్రెష్ టీమ్ తో ధృవ్ హీరోగానే తెరకెక్కిస్తామని నిర్మాతలు వెల్లడించడంతో దర్శకుడు బాలా స్థానంలో మెగాఫోన్ చేపట్టబోయే వ్యక్తి ఎవరా అని చర్చలు సాగుతున్నాయి.   ఇప్పటికే గౌతమ్ మీనన్ పేరు కూడా కోలీవుడ్ గాసిప్పుల్లో వినిపించింది. కానీ తాజా సమాచారం దానికి భిన్నంగా ఉంది.  తెలుగు 'అర్జున్ రెడ్డి' సినిమాకు సందీప్ వంగా దగ్గర అసోసియేట్ గా పనిచేసిన గిరీశయ్యను తమిళ రీమేక్ దర్శకుడిగా ఎంచుకున్నారని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది.  ఈ విషయంపై ఇంకా అధికారికంగా ధృవీకరణ రాలేదు కానీ దాదాపుగా ఇతనే డైరెక్టర్ గా కన్ఫాం అయినట్టని అంటున్నారు.  తెలుగు సినిమా మేకింగ్ లో పాలుపంచుకున్నాడు కాబట్టి సినిమా 'అర్జున్ రెడ్డి' పట్ల అవగాహన ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో నిర్మాతలు ఇలాంటి నిర్ణయానికి వచ్చారట.

హిందీ వెర్షన్ రీమేక్ ను సందీప్ వంగా స్వయంగా డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఎలాంటి ఇబ్బందులు లేవు. పైగా హిందీలో విజయ దేవరకొండ పాత్రలో నటిస్తున్న షాహిద్ సీనియర్ నటుడు.. దీంతో హిందీ రీమేక్ పై బోలెడు అంచనాలున్నాయి. కానీ  తమిళ వెర్షన్ వచ్చేసరికి హీరో  ధృవ్ కు ఇది పరిచయ చిత్రం కావడంతో దర్శకుడు ఎవరైనా అతనికి కత్తిమీద సాము లాంటిదే.  ఇప్పటికే ఒకసారి సినిమా స్క్రాప్ అయింది కాబట్టి ఈసారి మరింత జాగ్రత్తగా సినిమాను తెరకెక్కించాల్సి ఉంటుంది.  చూద్దాం.. ఏం జరుగుతుందో.