శ్రీదేవి కూతురుపై అర్జున్ కపూర్ హాట్ కామెంట్స్

Sun Jun 24 2018 16:45:00 GMT+0530 (IST)

అర్జున్ కపూర్.. బోనీ కపూర్ మొదటి భార్య కొడుకు.. బోనీ కపూర్ శ్రీదేవిని పెళ్లి చేసుకున్నాక అర్జున్ కపూర్ తల్లిని వదిలేశాడు. ఇక అప్పటి నుంచి అర్జున్ శ్రీదేవిపై కోపం పెంచుకున్నాడు. శ్రీదేవి బతికి ఉన్నంత కాలం ఆ కోపం అతడిలోనే ఉంది. మీడియా ముందు కూడా ఓసారి శ్రీదేవిపై చిందులేశాడు. ఇక శ్రీదేవి కూతుళ్లు జాన్వి ఖుషీలతో అర్జున్ సన్నిహితంగా మెలిగింది లేదు. కానీ శ్రీదేవి మరణం తర్వాత అర్జున్ కపూర్ పూర్తిగా మారిపోయాడు.శ్రీదేవి హఠాన్మరణం తర్వాత అర్జున్.. శ్రీదేవి కూతుళ్లను చేరదీశాడు.  వారిని అన్నగా ఓదార్చాడు. వారికి బాగా దగ్గరయ్యాడు. ఆ తర్వాత కూడా సోషల్ మీడియాలో తన చెల్లెలు జాన్వీకి సపోర్టుగా రెండు మూడు సార్లు పోస్టులు కూడా చేశాడు. ఆమె మీద తప్పుగా మాట్లాడిన వారికి వార్నింగ్ ఇచ్చాడు. జాన్వి గురించి తప్పుగా రాసిన ఒక వెబ్ సైట్ మీద కూడా పోరాడాడు.

తాజాగా మరోసారి అర్జున్ తన చెల్లెలు గురించి పాజిటివ్ గా స్పందించాడు. ప్రస్తుతం జాన్వి కథనాయికగా ‘దఢక్’ అనే బాలీవుడ్ సినిమా రూపొందింది. ఈ సినిమా ప్రివ్యూను అందరికంటే ముందే చూసిన అర్జున్ జాన్వి నటనపై ప్రశంసలు కురిపించాడు. తన అన్న తనను ఇంతలా పొగిడేసరికి జాన్వి ఎమోషనల్ అయ్యింది. ‘ఈ సినిమాలో నువ్వు చాలా నిజాయితీతో నటించావు. ఒక హీరోయిన్ లాగా కనిపించలేదు. పాత్రలో లీనమైపోయావు. నిజాయితీగా నీ పాత్రకు న్యాయం చేశావ్’ అంటూ అర్జున్ తనను ప్రశంసించినట్లు జాన్వి ఉద్వేగంగా చెప్పింది.

దఢక్ సినిమా రిలీజ్ తర్వాత ఎన్ని ప్రశంసలు వచ్చినా అర్జున్ ఇచ్చిన ప్రశంసే నాకు ఉత్తమమైనది అని చాలా ఉద్వేగంగా చెప్పింది జాన్వీ. అలాగే తన తండ్రి బోనీకపూర్ కూడా సినిమా చూసి మెచ్చుకున్నారని.. చాలా సహజంగా నటించావని కితాబిచ్చారని జాన్వీ చెప్పింది. దఢక్ చిత్రం ఈనెల  20న ప్రేక్షకుల ముందుకు రానుంది.