యుఎస్ సెక్స్ రాకెట్.. ఆమెకు మండిపోయింది

Wed Jun 20 2018 16:06:44 GMT+0530 (IST)

యుఎస్ లో బయటపడ్డ సెక్స్ రాకెట్ అంశం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. నిజానికి దీని గురించి ఇంత చర్చ అయితే అవసరం లేదు. ఎవరో కొందరు హీరోయిన్లు.. యాంకర్లు అమెరికాకు ఈవెంట్ల పేరుతో వెళ్లి వ్యభిచారం చేస్తే దాన్ని ఇండస్ట్రీ మొత్తానికి ఆపాదించడం.. ఇక్కడి వాళ్లను బాధ్యుల్ని చేయడం అన్నది సమంజసం కాదు. కానీ ఇలాంటి సెన్సేషనల్ అంశాలు దొరికితే మీడియా ఊరుకుంటుందా? కొంత కాలంగా సరైన టాపిక్ లేక చర్చలు డ్రైగా మారిపోవడంతో కొత్తగా ఏం కంటెంట్ దొరుకుతుందా అని ఎదురు చూశాయి మీడియా ఛానెళ్లు. వాళ్లకు యుఎస్ సెక్స్ రాకెట్ రూపంలో మంచి టాపిక దొరికింది. ఇంకేముంది ఛానెళ్లు తమదైన శైలిలో రెచ్చిపోతున్నాయి. గంటలు గంటలు చర్చలు పెట్టేస్తున్నాయి.అసలు యుఎస్ సెక్స్ రాకెట్లో ఎవరు దొరికారో తెలియదు. కచ్చితంగా ఎవరి పేర్లూ బయటికి రాలేదు. దీనిపై ఏ స్పష్టతా లేదు. అయినప్పటికీ ఛానెళ్లు ఊరుకుంటున్నాయా? ఎవరెవరినో తీసుకొచ్చి చర్చల్లో కూర్చోబెడుతున్నాయి. మధ్యలో ఎవరెవరినో లైన్లోకి తెస్తున్నాయి. అభిప్రాయం చెప్పమంటున్నాయి. మీకేమైనా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయా అంటూ ఇబ్బందికర ప్రశ్నలు వేస్తున్నాయి. ఒక ఛానెల్ ఈ తరహాలోనే హీరోయిన్ అర్చనను ప్రశ్నిస్తే ఆమెకు మండిపోయింది. ఎవరో కొందరు చేస్తే దీన్ని ఇండస్ట్రీ మొత్తానికి ఎలా ఆపాదిస్తారు.. ఇలాంటి ప్రశ్నలు ఎలా వేస్తారు అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో సదరు ఛానెల్ యాంకర్ కు ఏం చేయాలో పాలుపోలేదు. ఊహించని విధంగా ఎదురు దాడి జరగడంతో అర్చన వాదన పూర్తి కాకముందే లైన్ కట్ చేసి పారేసి.. టాపిక్ మార్చేసింది యాంకర్.