Begin typing your search above and press return to search.

వీర రాఘవా.. చాలా దూరం వెళ్లాలయ్యా

By:  Tupaki Desk   |   16 Oct 2018 1:16 PM GMT
వీర రాఘవా.. చాలా దూరం వెళ్లాలయ్యా
X
గత కొన్నేళ్లలో తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. అమెరికాలోనూ తన మార్కెట్ బాగా పెంచుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఒకప్పుడు 1 మిలియన్ డాలర్ల మార్కే అతడికి సవాలుగా ఉండేది. అలాంటిది ‘నాన్నకు ప్రేమతో’ 2 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. ‘జనతా గ్యారేజ్’ సైతం 2 మిలియన్ మార్కుకు చేరువగా వెళ్లింది. ఇప్పుడు ఎన్టీఆర్‌ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి క్లాస్ డైరెక్టర్ తోడవడంతో ‘అరవింద సమేత’ అక్కడ వసూళ్ల మోత మోగించేసి ఎన్టీఆర్ ను 3 మిలియన్ క్లబ్బులోకి తీసుకెళ్తుందని అంచనా వేశారు. త్రివిక్రమ్ కు మామూలుగానే అక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. ‘అజ్ఞాతవాసి’ నిరాశ పరిచినా.. ఆ ప్రభావం ‘అరవింద సమేత’పై ఉండదనే అనుకున్నారు. బయ్యర్లు కూడా అదేమీ పట్టించుకోకుండా ఈ చిత్రంపై భారీగా పెట్టుబడి పెట్టారు.

అమెరికాలో ‘అరవింద సమేత’ బ్రేక్ ఈవెన్‌ కు రావాలంటే 2.7 మిలియన్ డాలర్లు వసూలు చేయాలి. ఈ సినిమా ప్రిమియర్ల సందర్భంగా కనిపించిన ఊపు చూస్తే 3 మిలియన్ మార్కు డెడ్ ఈజీ అన్నట్లు కనిపించింది. కేవలం ప్రిమియర్లతోనే 8 లక్షల డాలర్లు వసూలు చేసి తొలి రోజు కూడా జోరు కొనసాగించింది ‘అరవింద సమేత’. గురువారం ఉదయం షోలకే మిలియన్ మార్కును దాటేసింది. దీంతో వీకెండ్ అయ్యేసరికి 2.5 మిలియన్లకు చేరువగా వసూళ్లు వెళ్తాయని అంచనా వేశారు. రెండో వీకెండ్లో 3 మిలియన్లకు చేరడం ఖాయం అనుకున్నారు. కానీ ‘అరవంద సమేత’ ఈ అంచనాల్ని అందుకోలేకపోయింది. అదిరిపోయే ఆరంభం తర్వాత ఈ చిత్రం అండర్ పెర్ఫామ్ చేసింది. వీకెండ్ అయ్యేసరికి 1.8 మిలియన్లు మాత్రమే వసూలు చేసింది. ప్రిమియర్లతోనే 8 లక్షల డాలర్లు కొల్లగొట్టిన ఈ చిత్రం నాలుగు రోజుల్లో మిలియన్ మాత్రమే వసూలు చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. సోమవారం తెలుగు రాష్ట్రాల్లో మాదిరే అక్కడా వసూళ్లు బాగా డ్రాప్ అయ్యాయి. 30 వేల డాలర్లు మాత్రమే వచ్చాయి. మొత్తంగా ఇప్పుడు ఈ చిత్రం 1.85 మిలియన్ల దగ్గర ఉంది. 2 మిలియన్ మార్కును అందుకోవచ్చు కానీ.. అంతకుమించి ఎంతో దూరం ప్రయాణించే అవకాశాలు కనిపించడం లేదు. బ్రేక్ ఈవెన్ కు ఆఫ్ మిలియన్ అయినా తక్కువ పడేలా ఉంది.