Begin typing your search above and press return to search.

అంత వీక్ అయితే సినిమాల్లోకి రావొద్దు

By:  Tupaki Desk   |   22 July 2018 11:48 AM GMT
అంత వీక్ అయితే సినిమాల్లోకి రావొద్దు
X
సినీ రంగానికి ఉన్న ఆకర్షణ దృష్ట్యా ఇక్కడ ఒక వెలుగు వెలిగిపోవాలని చాలామంది వస్తుంటారు. కానీ ఆ ప్రయత్నంలో అందరూ విజయవంతం కారు. బయటికి మెరుస్తూ కనిపించే ఈ ఇండస్ట్రీలో.. లోలోన చాలా సమస్యలుంటాయి. సవాళ్లను దాటి తెరపై వెలిగేవాళ్లు చాలా కొద్దిమందే. ఈ ప్రయత్నంలో విఫలమై జీవితాల్ని నాశనం చేసుకునేవాళ్లు చాలామందే ఉంటారు. ఆశించిన స్థాయికి చేరలేక జీవితాన్ని ముగించేవాళ్లు కూడా ఉంటారు. ఈ ఉందంతాలపై మలయాళ నటి అమలాపాల్‌ స్పందించింది. సినీ పరిశ్రమలో కొనసాగాలంటే చాలా ధైర్యం కావాలని.. అది లేని వాళ్లు ఈ రంగంలోకి రాకూడదని ఆమె తేల్చిచెప్పింది.

ఫ్యామిలీ సెంటిమెంటుతో కొందరు హీరోయిన్లు మనసు చంపుకుని నటనకు దూరం అవుతున్నారని.. కొందరు ప్రాణాలను తీసుకోవడం వంటి అగత్యాలకు పాల్పడుతున్నారని ఆమె చెప్పింది. బలహీనమైన వారికి సినిమా సెట్‌ అవ్వదని.. ఈ రంగంలో ఎప్పుడైనా.. ఏమైనా జరగవచ్చునని అమల అంది. మనోధైర్యం కలిగిన వారే ఇక్కడ నిలదొక్కుకోగలరని స్పష్టం చేసింది. అదే సమయంలో సినీ రంగానికే కాక ఏ రంగంలోని మహిళలకైనా ఇది వర్తిస్తుందని ఆమె చెప్పింది. సినిమాలకు సంబంధించి పురుషుల కంటే మహిళలే చాలా సవాళ్లనే ఎదుర్కొనాల్సి ఉంటుందని అమల అభిప్రాయపడింది. కెరీర్ ఆరంభంలో తమిళంలో ఒక బి-గ్రేడ్ సినిమాలో నటించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న అమల.. ఆ తర్వాత రెగ్యులర్ సినిమాల్లో నటిగా తనేంటో రుజువు చేసుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దర్శకుడు విజయ్ ను పెళ్లాడిన రెండేళ్లకే అతడి నుంచి విడిపోయిన అమల.. ఇప్పుడు స్వతంత్రంగా తనకు నచ్చినట్లు జీవిస్తోంది. తమిళంలో ఆమె కెరీర్ బాగానే సాగుతోంది.