అనుని సైడ్ చేసిన ఫ్రెండ్స్!!

Sat Oct 20 2018 18:47:57 GMT+0530 (IST)

ప్రేమమ్-శతమానం భవతి లాంటి చెప్పుకోదగ్గ హిట్స్ ఉన్నప్పటికీ ఈ మధ్య సక్సెస్ కు బాగా దూరమైపోయింది మలయాళీ కుట్టి అనుపమ పరమేశ్వరన్ హలో గురు ప్రేమ కోసమే మీద గట్టి ఆశలే పెట్టుకుంది. నిజానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే ప్రకాష్ రాజ్ రామ్ ల మధ్యే ఎక్కువ ట్రాక్ బాండింగ్ ఇందులో ఉందని తానేం చేశానని దిల్ రాజుని స్టేజి మీదే అడిగేసింది. అందరు సరదాగా తీసుకున్నా ఆ భయమే నిజమై కూర్చుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ కీలకమైన కొన్ని సన్నివేశాల్లో తప్ప మొత్తం రామ్ ప్రకాష్ రాజ్ ల ఫ్రెండ్ షిప్ చుట్టే కథనం సాగింది. వాళ్ళిద్దరి మధ్య కామెడీనే జనం ఎంజాయ్ చేస్తున్నారు.దీంతో లవ్ ట్రాక్ కాస్త వీక్ గా అనిపించిన మాట వాస్తవం. ఇప్పుడు అనుపమకు దీని వల్ల ఎంత మేర ప్రయోజనం చేకూరుతుంది అంటే చెప్పడం కష్టం. పండగ సెలవులను వాడుకుంటూ మంచి ఓపెనింగ్స్ ను సాధించిన హలో గురు ప్రేమ కోసమే హిట్ స్టేటస్ తెచ్చుకుంటుందా లేదా అనేది మరో మూడు నాలుగు రోజుల్లో తేలిపోతుంది. అనుపమకు గత మూడు సినిమాలు తీవ్ర నిరాశను కలిగించాయి. ఉన్నది ఒకటే జిందగీ- కృష్ణార్జున యుద్ధం-తేజ్ ఐ లవ్ యు ఒకదాన్ని మించి ఒకటి టపా కట్టేశాయి.

వాటితో పోల్చుకుంటే హలో గురు ప్రేమ కోసమే ఎన్నో రెట్లు నయం. కానీ తన ట్రాక్ కన్నా ప్రకాష్ రాజ్ రామ్ ల ఎపిసోడ్లే హై లైట్ కావడం ఫ్యాన్స్ కు సైతం మింగుడు పడటం లేదు. ఏదైతేనేం అనుపమ తెలుగులో కోరుకున్న పెద్ద బ్రేక్ అయితే ఇది కాకపోవచ్చు - మరి నెక్స్ట్ వచ్చే సినిమా అయినా తన ఆశలను నిలబెడుతుందో లేదో వేచి చూడాలి