ట్రైలర్ టాక్: సూపర్ స్పేస్ థ్రిల్లర్

Sun Dec 09 2018 11:08:10 GMT+0530 (IST)

షూటింగ్ జరిగినన్నాళ్లు సైలెంట్ గా ఉన్న వరుణ్ తేజ్ కొత్త సినిమా అంతరిక్షం 9000 కెఎంపిహెచ్ ట్రైలర్ ఇందాకా విడుదలైంది. వరుణ్ తేజ్ హీరోగా అదితి రావు హైదరి- లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఇండియాలోనే మొదటి ఒరిజినల్ స్పేస్ థ్రిల్లర్ గా చెప్పబడుతోంది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే కథను నిజాయితీగా చెప్పేసారు. ఇండియన్ స్పేస్ సెంటర్ చేస్తున్న ఓ శాటిలైట్ ప్రయోగం ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థ తీవ్ర ప్రమాదంలో పడుతుంది. దీన్ని పరిష్కరించడంలో అంతకు ముందు అదే సెంటర్ పనిచేసి ఏవో కారణాల వల్ల బయటికి వెళ్ళిపోయిన దేవ్(వరుణ్ తేజ్)ని పిలిపిస్తారు.ముందు వద్దనుకున్నా టీమ్ అభ్యర్థనతో పాటు దేశ రక్షణ కూడా అందులో ముడిపడి  ఉండటంతో దేవ్ ఛాలెంజ్ కు ఒప్పుకుంటాడు. తన టీమ్ తో కలిసి అంతరిక్షంలో వెళ్లేందుకు సిద్ధ పడతాడు. చివరికి లక్ష్యం చేరుకున్నాడా లేదా అనేదే అంతరిక్షం థీమ్. దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఘాజీ తరహాలోనే స్టోరీ పాయింట్ ధైర్యంగా ముందే రివీల్ చేసేసాడు. ట్రైలర్ లో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇలాంటి పూర్తి తరహా స్పేస్ మూవీ తెలుగులో రాలేదు కాబట్టి ది బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడం కోసం సంకల్ప్ పడిన కష్టం ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. ఆవసరాల శ్రీనివాస్ వరుణ్ తేజ్ స్నేహితుడిగా కీలక పాత్రలో కనిపిస్తుండగా సెంటర్ బాద్యతలు చూసుకునే వ్యక్తిగా రెహమాన్ పాత్ర కూడా ప్రాధాన్యత ఉన్నదిగానే కనిపిస్తోంది.

సత్యదేవ్ సపోర్టింగ్ రోల్ లో ఉన్నాడు.లావణ్య త్రిపాఠి పాత దేవ్ వ్యక్తిగత జీవితానికి సంబందించినట్టు కనిపిస్తోంది. జ్ఞాన శేఖర్ కెమెరా వర్క్ అవుట్ స్టాండింగ్ అని చెప్పొచ్చు. ప్రశాంత్ విహారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఎలివేట్ అయ్యింది. రాజీవ్ రాజశేఖరన్ సిజి వర్క్ ప్రత్యేక ప్రశంశలు అందుకుంటుంది. డిసెంబర్ 21న విడుదల తేదీని కన్ఫర్మ్ చేసిన అంతరిక్షం మొత్తానికి అంచనాలు అమాంతం పెంచడంలో సక్సెస్ అయ్యింది.