Begin typing your search above and press return to search.

‘నువ్వు నేను’ పాప.. ఎన్నాళ్లకెన్నాళ్లకు

By:  Tupaki Desk   |   28 Aug 2016 7:30 AM GMT
‘నువ్వు నేను’ పాప.. ఎన్నాళ్లకెన్నాళ్లకు
X
అనిత.. అంత సులభంగా మరిచిపోయే పేరు కాదిది. ‘నువ్వు నేను’ సినిమా చూసి లక్షలాది మంది తెలుగు కుర్రాళ్లు ఆమె ప్రేమలో పడిపోయారు. అవ్వడానికి ముంబయి అమ్మాయే కానీ.. మన చుట్టుపక్కల ఉండే తెలుగమ్మాయిలాగా కనిపిస్తూ తన సింపుల్ అందంతోనే భలేగా ఆకట్టుకుందీ భామ. ఆమె అసలు పేరు నటాషా అయినా.. తెలుగు ప్రేక్షకులకు మాత్రం అనితగానే గుర్తుండిపోయింది. ‘నువ్వు నేను’ తర్వాత టాప్ రేంజికి వెళ్లిపోతుందనుకున్న అనిత.. సరైన సినిమాలు పడక వెనుకబడిపోయింది. అయినప్పటికీ ఐదారేళ్లు ఎలాగోలా నెట్టుకొచ్చింది కానీ.. తర్వాత నిలబడలేకపోయింది. గత ఐదారేళ్ల నుంచి అసలు టాలీవుడ్లోనే కనిపించలేదు అనిత.

హిందీ సీరియళ్లలో కీలక పాత్రలు చేస్తూ.. సినిమాల్లోనూ చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ సాగిపోయిన అనిత.. మధ్యలో పెళ్లి కూడా చేసుకుంది. దీంతో తెలుగు ప్రేక్షకులు అనితను పూర్తిగా మరిచిపోయారు. ఇక మళ్లీ ఆమెను తెలుగు తెరపై కనిపించే అవకాశాలే లేవు అనుకుంటుండగా అనుకోకుండా ఇప్పుడు ఆర్పీ పట్నాయక్ సినిమా ‘మనలో ఒకడు’లో నటించింది. ‘నువ్వు నేను’ సినిమా ఆర్పీకి కూడా ఒక మైల్ స్టోన్. ఆ సెంటిమెంటును దృష్టిలో ఉంచుకునే తన పక్కన అనితను హీరోయిన్ గా తీసుకున్నట్లున్నాడు. నిన్న హైదరాబాద్ లో ‘మనలో ఒకడు’ ఆడియో వేడుక చేయగా.. అనిత ఆ కార్యక్రమానికి హాజరై అందరి దృష్టినీ ఆకర్షించింది.