Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ తో కొలవెరి కుర్రాడు?

By:  Tupaki Desk   |   4 Aug 2015 11:39 AM GMT
త్రివిక్రమ్ తో కొలవెరి కుర్రాడు?
X
కొలవెరి పాటతో తెలుగు ప్రేక్షకుల్ని కూడా ఉర్రూతలూగించేశాడు అనిరుధ్ రవిచందర్. ఏదో ఆ ఒక్క పాటతో మెరిసి మాయమవ్వకుండా తమిళంలో హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు ఈ బక్క మ్యూజిక్ డైరెక్టర్. ఈ కుర్రాడితో డైరెక్ట్ తెలుగు సినిమాకు పని చేయించడానికి ముందు నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. శ్రీను వైట్ల-రామ్ చరణ్ సినిమాకు ముందు అనిరుధ్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు. కానీ రెమ్యూనరేషన్ విషయం లో ఏదో తేడా జరగడం వల్ల అనిరుధ్ పక్కకు వెళ్లిపోయినట్లు వార్తలొచ్చాయి. ఐతే కొంచెం ఆలస్యమైనా ఈ ఏడాదే అనిరుధ్ తెలుగులో అరంగేట్రం చేయడం ఖాయమని తెలుస్తోంది.

శ్రీను వైట్ల మిస్సయినా.. త్రివిక్రమ్ లాంటి మరో అగ్ర దర్శకుడి సినిమాతో అనిరుధ్ తెలుగులోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత త్రివిక్రమ్ నితిన్ తో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అనిరుధ్ తో మ్యూజిక్ చేయించబోతున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ జల్సా దగ్గర్నుంచి దేవీనే ప్రిఫర్ చేస్తున్నాడు. ఐతే అతను ఫుల్ బిజీగా ఉండటంతో తక్కువ సమయంలో పూర్తి చేయాలనుకుంటున్న నితిన్ సినిమాకు అనిరుధ్ ను ఎంచుకున్నట్లు సమాచారం. ఐతే శ్రీనువైట్ల సినిమాకు అనిరుధ్ రెండు కోట్లకు పైగా పారితోషకం అడగడం వల్లే అతణ్ని తీసుకోలేదని వార్తలొచ్చాయి. మరి త్రివిక్రమ్-నితిన్ సినిమా బడ్జెట్ కూడా తక్కువే. అలాంటపుడు అనిరుధ్ కు ఎంతిస్తారో చూడాలి మరి. నితిన్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తుందని భావిస్తున్న ఈ సినిమాను హారిక- హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ నిర్మించనున్నాడు.