Begin typing your search above and press return to search.

హీరో అవుదామని అనుకుంటున్నాడా?

By:  Tupaki Desk   |   15 Jun 2019 10:48 AM GMT
హీరో అవుదామని అనుకుంటున్నాడా?
X
కోలీవుడ్ లో టాప్ లీగ్ మ్యూజిక్ డైరెక్టర్లలో అనిరుధ్ రవిచందర్ ఒకరు. తమిళ ప్రేక్షకులే కాదు అనిరుధ్ కు సౌత్ అంతా అభిమానులు ఉన్నారు. కొలవెరిడి పాటతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించి గుర్తింపు సాధించిన అనిరుధ్ ప్రస్తుతం తమిళంలో క్రేజీ ప్రాజెక్టులకు సంగీతం అందిస్తున్నాడు. టాలీవుడ్ లో అనిరుధ్ డెబ్యూ ఫిలిం పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి'.. ఆ సినిమా ఫ్లాప్ కావడమే కాదు. ఆసినిమాకు అనిరుధ్ సంగీతం సెట్ కాలేదని విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఈమధ్య నాని చిత్రం 'జెర్సీ' కి సూపర్బ్ మ్యూజిక్ అందించి అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు.

అదంతా సరే.. ఇప్పుడు అనిరుధ్ బాబు టాపిక్ ఎందుకు వచ్చిందంటే ప్రస్తుతం అనిరుధ్ యూరోప్ టూర్ లో ఉన్నాడు. రీసెంట్ గా ఇండియా - ఆస్ట్రేలియా మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించాడు. ఆ ఫోటోను తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. అయితే ఆ మ్యాచ్ తర్వాత అనిరుధ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటోలపై ఒక లుక్కేస్తే మనోడు హీరో అవుదామనే ఆలోచనలో ఉన్నట్టుగా అనిపిస్తోంది. గడ్డం.. ఆ స్టైలు.. మోడరన్ డ్రెస్సులు.. "ఆలుమా డోలుమా ఇసాలంగడి మాలుమా" అన్నట్టుగా ఊపులో ఉంది. అదేంటని అనుకోకండి. తల అజిత్ 'వేదాళం' సినిమాలో అనిరుధ్ స్వరపరిచిన చార్ట్ బస్టర్ సాంగ్.

ఒకవేళ అనిరుధ్ హీరో కావాలనుకుంటే మాత్రం అది పెద్ద విషయమేమీ కాదు. హీరోగా నిలదొక్కుకోవడం కష్టం కానీ హీరోగా ఒక సినిమాలో నటించడం అనిరుధ్ లాంటి వారికి చిటికెలో పని. పైగా అనిరుధ్ కు కెమెరా కొత్తేమీ కాదు. తన పాటలు తనే పాడడం కాకుండా.. వీడియో సాంగ్ వెర్షన్స్ కూడా రిలీజ్ చేస్తాడు. అప్పట్లో 'అజ్ఞాతవాసి' సినిమాలో ఒక పాటకు అలానే ఒక వీడియో సాంగ్ రిలీజ్ చేశాడు. తమిళంలో ఇప్పటికే మరో మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కూడా హీరో అయ్యాడు. అదే బాటలో అనిరుధ్ కూడా నిజంగానే హీరో అవుతాడా లేదా.. ఈ జెనరేషన్ బాయ్ లాగా జస్ట్ స్టైల్ గా ఫోటోస్ తీయించుకున్నాడా అనేది వేచి చూడాలి.