Begin typing your search above and press return to search.

కొలవరి వెనుక అసలు కథేంటో చెప్పాడు

By:  Tupaki Desk   |   17 Oct 2017 6:56 AM GMT
కొలవరి వెనుక అసలు కథేంటో చెప్పాడు
X
అనిరుధ్ రవిచందర్.. పరిచయం అక్కర్లేని పేరు. ఆరేళ్ల కిందటే.. టీనేజీలో ఉండగానే ‘కొలవరి’ పాటతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడీ యువ సంగీత సంచలనం. అప్పట్లో ఆ పాట ఎంతటి ప్రకంపనలు రేపిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆడియో విడుదల కంటే ముందు ఆ పాట ఆన్ లైన్లో లీక్ అయిపోయి సంచలనం సృష్టించడం.. తర్వాత చిత్ర బృందం ఒరిజినల్ పాటనే లాంచ్ చేయగా అది మరింతగా ప్రకంపనలు రేపడం తెలిసిందే. ఆ పాటకు సంబంధించిన బ్యాగ్రౌండ్ స్టోరీని తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు అనిరుధ్. దీంతో పాటు తన సంగీత ప్రస్థానం గురించి.. తెలుగులో ఎంట్రీ గురించి కూడా మాట్లాడాడు.

‘‘నేను మూడేళ్ల వయసులో ఉండగానే పియానో పట్టాను. తర్వాత పెరిగే కొద్దీ అనేక రకాల సంగీత పరికరాలతో సాధన చేశాను. స్కూల్లో ఉండగా క్లాసులు అవ్వగానే సంగీతం మీదే నా దృష్టి ఉండేది. రకరకాల బ్యాండ్లతో స్కూల్లో సంగీత ప్రదర్శనలు ఇచ్చేవాడిని. నేను కాలేజీలో చేరిన రెండో సంవత్సరంలో నాకు ‘3’ సినిమాకు పని చేసే అవకాశం లభించింది. ఐతే నేను చేయలేనన్నాను. ట్యూన్స్ ఇవ్వగలనన్న నమ్మకముంది కానీ.. సినిమాలకు మ్యూజిక్ చేసే ప్రాసెస్ ఏంటన్నది తెలియదు. కాబట్టి నేను రెడీగా లేనన్నాను. కానీ ధనుష్ వాళ్లు పట్టుబట్టి చేయించారు. ‘3’ సినిమాకు 10 పాటలు రెడీ చేశాను. ఐతే ఆ ఏడాది నా పుట్టిన రోజు నాడు హైదరాబాద్ లో ఉండగా.. ‘కొలవెరి’ పాట లీక్ అయినట్లు సమాచారం వచ్చింది. ఆన్ లైన్లో చూస్తే అది రఫ్ గా చేసిన పాట. అది చూసి కన్నీళ్లు వచ్చేశాయి. ఎంతో కష్టపడి తొలి సినిమా చేస్తుంటే ఇలా పాట లీక్ అవడం.. అది కూడా ఒరిజినల్ సాంగ్ కాకపోవడం నిరాశ కలిగించింది. దీంతో పాటలన్నింటినీ రిలీజ్ చేసేయాలనుకున్నాం. కానీ మేం అడిగిన టైంలోపు సీడీలు వేసి ఇవ్వడం కుదరదన్నారు. దీంతో యూట్యూబ్‌‌ లో పాట లాంచ్ చేయాలని నిర్ణయించుకున్నాం. అప్పటికది చాలా కొత్త. తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేశాం. అద్భుతమైన స్పందన వచ్చింది. అలా సంచలన రీతిలో నేను సంగీత దర్శకుడిగా లాంచ్ అయ్యా. ఇప్పుడు తెలుగులో పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ గారి సినిమాతోనూ అలాంటి అరంగేట్రమే లభిస్తుందని అనుకుంటున్నా’’ అని అనిరుధ్ అన్నాడు.