అజ్ఞాతవాసి.. ఆ ముగ్గురికీ షాకిచ్చాడు

Sun Jan 14 2018 13:17:56 GMT+0530 (IST)

ఒక పెద్ద హీరో.. ఒక పెద్ద దర్శకుడు కలిశారంటే ఆ సినిమాపై ఆటోమేటిగ్గా అంచనాలు పెరిగిపోతాయి. అందులోనూ పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి అగ్ర దర్శకుడి కాంబోలో సినిమా అంటే ఇక అంచనాల గురించి చెప్పేదేముంది? ఇలాంటి క్రేజీ ప్రాజెక్టులో పని చేసే ప్రతి ఒక్కరూ తమ దశ తిరిగిపోతుందని ఆశిస్తారు. ‘అజ్ఞాతవాసి’ మీద చాలా మంది అలాగే ఆశలు పెట్టుకున్నారు. తమిళంలో గత కొన్నేళ్లలో అనిరుధ్ రవిచందర్ ఎదుగుదల అసాధారణం. తన ప్రతి సినిమాతో మెప్పిస్తూ.. అంచనాలు పెంచుతూ.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు సంపాదించాడు అనిరుధ్. అతను కొన్నేళ్ల కిందటే తెలుగులో అరంగేట్రం చేయాల్సింది కానీ.. కుదర్లేదు.ఎట్టకేలకు పవన్ లాంటి పెద్ద సూపర్ స్టార్.. త్రివిక్రమ్ లాంటి పెద్ద దర్శకుడి సినిమాతో లాంచ్ అయ్యే అద్భుత అవకాశం దక్కింది. ఇలాంటి అరంగేట్రం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. ఈ విషయంలో అతడి ఆనందం మామూలుగా లేదు. ఈ సినిమాతో తెలుగులో బిజీ అయిపోతానని ఆశించాడు. కానీ చివరికి ఈ సినిమా తేడా కొట్టేసింది. మ్యూజిక్ విషయంలో అనిరుధ్ కూడా అంచనాల్ని అందుకోలేకపోయాడు. దీంతో త్రివిక్రమ్ తర్వాతి సినిమాకు అనిరుధ్ వద్దని.. దేవిశ్రీని తీసుకుందామని ఎన్టీఆర్ అంటున్నట్లుగా కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే తెలుగులో కొన్ని సినిమాలు చేసినప్పటికీ.. పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోతో కలిసి నటించే అవకాశం రావడంతో హీరోయిన్లు కీర్తి సురేష్.. అను ఇమ్మాన్యుయెల్ ల ఆనందం కూడా అంతా ఇంతా కాదు. ఈ సినిమాతో ఒక్కసారిగా స్టార్ స్టేటస్ వచ్చేస్తుందని ఆశించారు. కానీ వాళ్లకూ ‘అజ్ఞాతవాసి’ నిరాశనే మిగిల్చింది. హీరోయిన్లిద్దరి పాత్రలూ సినిమాలు తేలిపోయాయి. కొత్తగా పేరు రావడం.. స్టేటస్ మారడం సంగతటుంచితే.. ఉన్న స్టేటస్ కూడా నిలిచే పరిస్థితి లేకుండా పోయింది ఈ హీరోయిన్లకు. ఇలా ఈ ముగ్గురూ ‘అజ్ఞాతవాసి’పై పెట్టుకున్న అంచనాలు తలకిందులయ్యాయి.