Begin typing your search above and press return to search.

యంగ్‌ హీరోతో హిందీ సినిమా రీమేక్‌ సన్నాహాలు

By:  Tupaki Desk   |   20 Oct 2018 3:52 AM GMT
యంగ్‌ హీరోతో హిందీ సినిమా రీమేక్‌ సన్నాహాలు
X
టాలీవుడ్‌ లో రీమేక్‌ లు కొత్తేం కాదు. కాని హిందీ సినిమాలను తెలుగులో రీమేక్‌ చేయడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. సౌత్‌ చిత్రాలను ఎక్కువగా రీమేక్‌ చేసే తెలుగు ఫిల్మ్‌ మేకర్స్‌ హిందీ సినిమాల్లో ఏదైనా తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్‌ అవుతుందని భావిస్తే తప్పకుండా ప్రయత్నించేందుకు సిద్దం అవుతారు. ఇప్పటికే పలు హిందీ సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాగా - కొన్ని సక్సెస్‌ ను దక్కించుకోగా - మరి కొన్ని మాత్రం బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. తాజాగా మరో హిందీ సినిమాను రీమేక్‌ చేసేందుకు అనీల్‌ సుంకర ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

హిందీలో చిన్న బడ్జెట్‌ చిత్రంగా తెరకెక్కిన ‘షాదీ మెయిన్‌ జరూర్‌ ఆనా’ అనే చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఒరిజినల్‌ వర్షన్‌ లో రాజ్‌ కుమార్‌ రావు మరియు కృతి కర్బందలు నటించారు. కాన్సెప్ట్‌ బేస్డ్‌ చిత్రంగా రూపొందిన ఈ చిత్రం అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు సౌత్‌ ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యేలా ఈ చిత్రం ఉంది అంటూ ఫిల్మ్‌ మేకర్స్‌ భావిస్తున్నారు. అందుకే అనీల్‌ సుంకర ఈ చిత్రం రీమేక్‌ రైట్స్‌ ను కొనుగోలు చేసి - ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరిపిస్తున్నాడు.

ఒక యువ హీరోతో ఈ రీమేక్‌ ను ఆయన ప్లాన్‌ చేస్తున్నట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఒక వైపు భారీ చిత్రాలను నిర్మిస్తూనే - మరో వైపు ఇలా యువ హీరోతో కాన్సెప్ట్‌ బేస్డ్‌ చిత్రాలను తెరకెక్కించేందుకు అనీల్‌ సుంకర ఆసక్తిగా ఉన్నాడు. ప్రస్తుతం శరవేగంగా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రంకు సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే రాబోతుంది. ఆ సమయంలోనే చిత్ర దర్శకుడు - హీరో హీరోయిన్‌ ఇతర టెక్నీషియన్స్‌ వివరాలను ప్రకటించే అవకాశం ఉంది.