మోక్షజ్ఞను అలా చూడాలనుకున్న డైరెక్టర్

Tue Jan 01 2019 16:34:17 GMT+0530 (IST)

‘పటాస్’తో ప్రేక్షకులను అలరించి వరుసగా మంచి చిత్రాలతో మెప్పిస్తున్న దర్శకుడు అనీల్ రావిపూడి ఈ సంక్రాంతికి ‘ఎఫ్ 2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న ఎఫ్ 2 చిత్రం ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన అనీల్ రావిపూడి ఇదే సంక్రాంతికి రాబోతున్న ‘ఎన్టీఆర్’ చిత్రం పై కూడా స్పందించాడు. అందరిలాగే తాను కూడా బాలకృష్ణ ‘ఎన్టీఆర్’ మూవీ కోసం వెయిట్ చేస్తున్నానని ‘ఎన్టీఆర్’ చిత్రంలో బాలకృష్ణ పాత్రను మోక్షజ్ఞ నటిస్తే చూడాలనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు.నందమూరి అభిమానులు అంతా కూడా ‘ఎన్టీఆర్’ చిత్రంలో బాలయ్య పాత్రను మోక్షజ్ఞ పోషించబోతున్నట్లుగా భావించారు. కాని బాలయ్య చిన్నప్పటి పాత్ర తప్ప పెద్దయ్యాక కనిపించకుండా స్క్రీన్ ప్లే సాగబోతుందని తెలుస్తోంది. బాలకృష్ణ పాత్రను మోక్షజ్ఞతో చేయిస్తే సినిమా స్థాయి అమాంతం పెరిగి పోయేది. కాని బాలయ్య మాత్రం అందుకు ఆసక్తిగా లేడని తెలుస్తోంది. అందరిలా అనీల్ రావిపూడి కూడా బాలకృష్ణ పాత్రను మోక్షజ్ఞ చేయాలని కోరుకున్నాడట.

అనీల్ మొదటి సినిమా విడుదలైనప్పటి నుండి కూడా బాలకృష్ణతో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆమద్య ఇద్దరి కాంబోలో మూవీ పట్టాలెక్కబోతున్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. కాని ఆ వార్తలు పుకార్లుగానే మిగిలి పోయాయి. ఇప్పుడు ‘ఎన్టీఆర్’ గురించి మాట్లాడి బాలయ్య దృష్టిలో పడి నందమూరి హీరోతో మరో సినిమాను చేయాలని అనీల్ రావిపూడి అనుకుంటున్నాడా అనిపిస్తోంది. ‘ఎఫ్ 2’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే ఖచ్చితంగా అనీల్ రావిపూడికి భారీ ఆఫర్లు తలుపు తట్టే అవకాశం ఉంది.