Begin typing your search above and press return to search.

రివ్యూలపై భలే చెప్పాడుగా..

By:  Tupaki Desk   |   17 Oct 2017 8:08 AM GMT
రివ్యూలపై భలే చెప్పాడుగా..
X
ఎన్నడూ లేని విధంగా ఈ మధ్య సినిమా రివ్యూల గురించి ఆసక్తికర చర్చ నడుస్తోంది. స్టార్ హీరోలు, డైరెక్టర్లు రివ్యూలపై మండిపడుతున్నారు. అల్లు అర్జున్, హరీష్ శంకర్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్లు రివ్యూలపై అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు, నాగార్జున మాత్రం కొంచెం ఆచితూచి స్పందించారు. రివ్యూలపై పెద్ద చర్చ నడుస్తున్న నేపథ్యంలో కొత్తగా విడుదలయ్యే ప్రతి సినిమాకు సంబంధించిన దర్శకుల్ని, హీరోల్ని మీడియా వాళ్లు స్పందన అడుగుతున్నారు. దీపావళికి ‘రాజా ది గ్రేట్’తో పలకరించబోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి, హీరో రవితేజలకు కూడా ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రశ్న ఎదురైంది. ఐతే రవితేజ ఈ విషయంలో మౌనం వహించగా.. అనిల్ రావిపూడి చక్కటి సమాధానం చెప్పాడు.

‘‘ఈ విషయంపై ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఏం మాట్లాడితే ఏమవుతుందో అనిపిస్తోంది. ఐతే ఒక సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చి.. పెద్దగా ఆడని సినిమాలున్నాయి. ఇంకో సినిమాకు నెగెటివ్ రివ్యూలు వచ్చినా భారీ వసూళ్లు రాబట్టిన సినిమాలున్నాయి. అలాగే రివ్యూలకు తగ్గట్లుగా వసూళ్లు వచ్చిన సినిమాలూ ఉన్నాయి. సినిమాల మీద భిన్నాభిప్రాయాలున్నట్లే రివ్యూల మీద కూడా భిన్నాభిప్రాయాలుంటాయి. సినిమా తీసేవాళ్లయినా.. రివ్యూలు రాసేవాళ్లయినా.. ఎవరూ పర్ఫెక్ట్ కాదు. ఎవరూ దేన్నీ కరెక్ట్ గా చేయలేదు. కాబట్టి ఎవరినీ ఏమీ అనాల్సిన పని లేదు. నా వరకు వస్తే ‘పటాస్’ సినిమాకు సంబంధించి పాజిటివ్ రివ్యూలతో పాటు నెగెటివ్ వ్యాఖ్యలు కూడా వినిపించాయి. నేను కొంచెం కొత్తగా ట్రై చేయాల్సిందని అభిప్రాయపడ్డారు. అందువల్లే నేనిప్పుడు ‘రాజా ది గ్రేట్’తో ఒక కొత్త కథను ట్రై చేస్తున్నానేమో’’ అని రివ్యూలపై రివ్యూను ముగించాడు అనిల్ రావిపూడి.