పిల్లి కళ్లోడిని నమ్మొద్దు!

Wed Dec 05 2018 10:46:25 GMT+0530 (IST)

సందీప్ కిషన్ - తమన్నా - నవదీప్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'నెక్ట్స్ ఏంటి?'. బాలీవుడ్ దర్శకుడు ఖునాల్ కోహ్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ దసపల్లా లో జరిగిన నెక్ట్స్ ఏంటి? ప్రీరిలీజ్ ఈవెంట్‌లో కొన్ని ఛమక్కులు కార్యక్రమాని కే హైలైట్.ఈ కార్యక్రమానికి తమన్నా గ్లామర్ .. డ్యాన్సులు ప్రధాన ఆకర్షణగా నిలిస్తే అంతకుమించి శ్యామల యాంకరింగ్ గ్లామర్ ఆకట్టుకున్నాయి. వేదిక పైకి అతిధుల్ని ఆహ్వానిస్తూ యాంకర్ శ్యామల చేసిన ఓ కామెంట్ ఈ సందర్భంగా హాట్ టాపిక్ అయ్యింది. అప్పటివరకూ అతిధులందరినీ తెగ పొగిడేస్తూ వ్యాఖ్యానించిన శ్యామల ఉన్నట్టుండి నవదీప్‌ని వేదిక పైకి ఆహ్వానిస్తూ వేడెక్కించే కామెంట్ చేశారు.

అసలు పిల్లి కళ్లోడిని నమ్మొద్దని అంటారు! అంటూ నవదీప్‌ని వేదిక పైకి ఆహ్వానించింది శ్యామల. దీంతో సడెన్ ట్విస్టుకి షాకైన నవదీప్ బలవంతంగా నవ్వేస్తూ వేదిక పైకి వెళ్లాడు. పిల్లి కళ్లోడు! అన్న కామెంట్‌ని ఏదోలా కవర్ చేసేసినా.. ఆ తర్వాత పెళ్లెప్పుడు? అంటూ పదే పదే ప్రశ్నిస్తూ నవదీప్‌ని ఇర్రిటేట్ చేయడం చర్చకొచ్చింది. దీంతో నవదీప్ కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవం. అయితే వేదిక పై అంతా ఫన్నీ యంగ్ టీమ్ కాబట్టి ఈ ఇర్రిటేషన్ నడుమ బోలెడంత ఫన్ ఎలివేట్ అయ్యింది. నవదీప్ గత కొంతకాలంగా వెండి తెరతో పాటు బుల్లితెర కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. పెద్ద తెరపై పెద్ద స్టార్ కాకపోయినా కెరీర్ పరంగా డోఖా ఏం లేదు. చాలా గ్యాప్ తర్వాత `నెక్ట్స్ ఏంటి?` చిత్రంలో నటించాడు. ప్రతిభ ఉండీ వేగంగా ఎదగలేకపోయిన స్టార్‌గా నవదీప్ గురించి సన్నిహితులు చెబుతుంటారు.