ట్రెండీ టాక్: ఎమ్మెల్యే రంగమ్మత్త

Wed Jan 16 2019 12:45:07 GMT+0530 (IST)

రంగస్థలంలో రంగమ్మత్తగా గుండె జిల్లనిపించింది అనసూయత్త. సూయ సూయ అంటూ బోయ్స్ వెంటపడే రేంజు రంగమ్మత్తది. అందుకే ఈ బుల్లితెర హాట్ యాంకర్ ఏ పని చేసినా జనం ఎంతో ఆసక్తిగా పరిశీలిస్తుంటారు. ఈసారి పెద్ద తెరపై అనసూయను ఎలాంటి పాత్రలో చూసేందుకు వీలుంది? అంటే.. యువ ఎమ్మెల్యేగా కనులారా వీక్షించే వీలుందని తెలుస్తోంది.వైయస్సార్ పాదయాత్ర ఆధారంగా రూపొందిస్తున్న `యాత్ర` చిత్రంలో అనసూయ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఇందులో కర్నూలు జిల్లా ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పాత్రలో అనసూయ కనిపించనుందిట. రాజకీయాల్లో గౌరు హిస్టరీ చాలా ఆసక్తి రేకెత్తించేదే. 2004 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన గౌరు చరితారెడ్డి ఒకసారి నంది కొట్కూర్ నుంచి ఇంకోసారి పాణ్యం నుంచి ఎమ్మెల్యే అయ్యారు. 2014లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఐదుసార్లు ఓటమి అన్నదే తెలియని కాటసానిపైనే గెలుపొందారు.

యాత్ర ఈ ఫిబ్రవరిలో రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో యంగ్ ఎమ్మెల్యేగా అనసూయ నటన ఎలా ఉంటుందో తెరపై చూడాల్సిందే. ఇటీవలే రిలీజైన ఎఫ్ 2 చిత్రంలో అనసూయ ఓ పాటలో అందాల విందు చేసిన సంగతి తెలిసిందే. ప్రాధాన్యత లేని పాత్రలో నటించినందకు అనసూయ అభిమానులు చిన్నబుచ్చుకున్నారు. ఇక యాత్రలో ఆ లోటును పూడ్చే పాత్రలో తనని చూడొచ్చన్నమాట. యాత్ర చిత్రంలో వైయస్సార్ పాత్రలో మమ్ముట్టి నటిస్తున్నారు. ఇతర కీలక పాత్రలకు టాప్ స్టార్లను ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. మహి.వి.రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు.