Begin typing your search above and press return to search.

అన‌సూయ‌కి ఎంత ప్ర‌యారిటీ ఇస్తున్నాడో..!

By:  Tupaki Desk   |   6 Oct 2015 3:30 PM GMT
అన‌సూయ‌కి ఎంత ప్ర‌యారిటీ ఇస్తున్నాడో..!
X
సోగ్గాడే చిన్నినాయ‌నా ఒక్క పిట్ట‌నైన కొట్ట‌లేడే... అంటూ నాగేశ్వ‌ర‌రావు గురించి జ‌మున పాడుకొన్న పాట అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. అప్ప‌టి సోగ్గాడు ఒక్క పిట్ట‌ని కూడా కొట్ట‌లేక‌పోయాడేమో కానీ... ఇప్ప‌టి సోగ్గాడు మాత్రం బోలెడ‌న్ని పిట్ట‌ల్ని కొట్టేసేలాగే ఉన్నాడు. నిజం మ‌రీ... పిట పిట‌లాడే న‌లుగుర‌మ్మాయిల‌తో చేస్తున్న సంద‌డి చూస్తే నేటి సోగ్గాడు ఎంత‌టి హుషారైనోడే అర్థం చేసుకోవ‌చ్చు. అలాంటోడు ఎన్ని పిట్ట‌ల్నైనా కొట్టేస్తాడన‌డంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ న‌వ‌త‌రం సోగ్గాడు ఎవ‌రో ఈపాటికే మీకు అర్థ‌మైవుంటుంది. మ‌న మ‌న్మ‌థుడు నాగార్జున.
ఐదు ప‌దుల వ‌య‌సు దాటినా స‌రే ఇప్ప‌టికీ మ‌న్మ‌థుడు అనిపించుకొంటున్న ఏకైక హీరో నాగార్జునే అని చెప్పాలి.

ఆయ‌న సినిమాల్లో బోలెడంత గ్లామ‌ర్ ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్‌తో నాగ్ కెమిస్ట్రీ అదిరిపోతుంటుంది. ప్ర‌స్తుతం సెట్స్‌ పై ఉన్న `సోగ్గాడే చిన్ని నాయ‌నా` సినిమాలో ఏకంగా న‌లుగ‌ర‌మ్మాయిల‌తో ఆడిపాడుతున్నాడు నాగ్‌. ర‌మ్య‌కృష్ణ‌ - లావ‌ణ్య త్రిపాఠి క‌థానాయిక‌లుగా న‌టిస్తుండ‌గా, హంసానందిని - అన‌సూయ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. మామూలుగా సినిమాలో హీరోయిన్ ల‌కే హీరోలు ఎక్కువ‌గా ప్ర‌యారిటీ ఇస్తుంటారు. కానీ నాగార్జున మాత్రం ఇందులోని న‌లుగురు అమ్మాయిల‌కీ ప్రాధాన్య‌మిస్తున్నాడు. అయితే కీల‌క‌పాత్ర‌లో క‌నిపిస్తున్న అన‌సూయ‌కి అంద‌రికంటే కాస్త ఎక్కువ ప్ర‌యారిటీనే ఇస్తున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది.

చిన్న పాత్ర‌లో న‌టించిన‌వాళ్ల స్టిల్స్ బ‌య‌టికి వ‌చ్చే అవ‌కాశం చాలా త‌క్కువ‌. సినిమా ప్ర‌మోష‌న్‌ లోనూ, పోస్ట‌ర్ ల‌లోనూ వాళ్లు అస్స‌లు క‌నిపించ‌రు. కానీ అన‌సూయకి ఉన్న క్రేజ్ రీత్యా ఆమెకి బోలెడంత ప్ర‌యారిటీ ఇస్తున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. నాగ్ ట్విట్ట‌ర్‌ లో ఎప్పుడు స్టిల్స్ విడుద‌ల చేసినా అందులో అన‌సూయ ఫొటో త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంది. ఇదివ‌ర‌కు ఒక‌సారి కేవ‌లం తానూ, అన‌సూయ మాత్రమే ఉన్న స్టిల్‌ ని ట్విట్ట‌ర్‌ లో పోస్ట్ చేశాడు. ఇటీవ‌ల విడుద‌ల చేసినవాటిలో అన‌సూయతో క‌లిసి సెట్ లో ఉన్న‌ప్ప‌టి వ‌ర్కింగ్ స్టిల్స్ కూడా ఉన్నాయి. దీన్నిబ‌ట్టి అన‌సూయ‌కి ఎంత ప్ర‌యారిటీ ల‌భిస్తుందో అర్థం చేసుకోవ‌చ్చు. అన‌సూయ పాత్ర‌ని, ఆమె న‌ట‌న, అందం నాగార్జున‌కి బాగా న‌చ్చ‌డంతోనే ఆమెకి అంత ప్ర‌యారిటీ ఇస్తున్నాడ‌ని ఫిల్మ్‌ న‌గ‌ర్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇందులోగ‌న‌క అన‌సూయ క్యారెక్ట‌ర్ హిట్ట‌యితే ఇక ఆమెకి మ‌రిన్ని క్రేజీ ఆఫ‌ర్లు ల‌భించే అవ‌కాశాలున్నాయ‌ని ఫిల్మ్‌ న‌గ‌ర్ వ‌ర్గాలు చెబుతున్నాయి.