Begin typing your search above and press return to search.

విశ్లేషణ : మంచి మాట... చెడిపోతే!!!

By:  Tupaki Desk   |   22 May 2016 11:30 AM GMT
విశ్లేషణ : మంచి మాట... చెడిపోతే!!!
X
ఈ ఆర్టికల్ చదవడానికి వెళ్ళే ముందు మీకు కొన్ని విషయాలు స్పష్టం చెయ్యాలి. నేను ఫలానా నటుడికి ఫ్యాన్ ని చెప్పుకోవడం కంటే ఫలానా సినిమాకి అభిమానిని అని చెప్పుకుని గర్వపడతాను. ఈ కింద విశ్లేషిస్తున్న సినిమా మీతోపాటూ నన్నూ నిరాశపరిచింది. అయితే మనతో దర్శకుడు సినిమా ద్వారా ఏమి చప్పదలుచుకున్నాడనే అంశాలు నాకు అర్ధమైనవి మాత్రమే పొందుపరుస్తున్నా.. సినిమా చుసిన వారు ఓపికుంటే ఓ లుక్కేయండి..

ఒక సినిమా నిరాశపరిచినప్పుడు అది ఏ కొత్త హీరో చిత్రమో, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న దర్శకుడి ప్రయత్నమో అయితే ఇంతటి కధనానికి తావులేదు. కెరీర్ లో బెస్ట్ ఫామ్ లో వుండి ఆచితూచి అడుగేస్తున్న మహేష్ బాబు - కోటానుకోట్ల పెట్టుబడికి వెనుకాడని నిర్మాణ సంస్థ - అన్నిటికీ మించి కొత్త బంగారులోకాన్ని - సీతమ్మ వాకిటిని, ముకుందుడి చేష్టలని చూపించిన అడ్డాల ప్రయత్నం కాబట్టే ఈ కధంతా..

అసలు ఏం జరిగింది?

సినిమా ఫలితం 100రూపాయలు పెట్టి టిక్కెట్ కొన్న ప్రేక్షకుడికే ఇట్టే తెలిసిపోతున్నప్పుడు ఫైనల్ వెర్షన్ చూసుకుంటూ కనీసం వారం ముందు సిద్ధమైన చిత్రబృందానికి అర్ధంకాదంటారా? అయితే రామ్ గోపాల్ వర్మ చెప్పినట్టు ఏ సినిమా కధ కూడా ఇది ఫ్లాప్ అవుతుందనే ఆలోచనతో తెరకెక్కదు. కాలక్రమేనా దాని ఫలితం బయటపడుతుంది.

ఎందుకు జరిగింది?

అయితే ఫైనల్ అవుట్ పుట్ ని వదిలేసి - స్క్రిప్ట్ దశలో వున్న కధ ఏమయ్యివుంటుందా అని గెస్ చేద్దాం.. ఇతర దర్శకులు మనుషులతో ఆడుకుంటే శ్రీకాంత్ మనసులతో ఆడుకుంటాడు. మనిషి ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా చివరికి అతనికి సాయపడేది మరొక మనిషే.. మరి అలాంటి మనుషులు మన దగ్గర ఎంతమంది వున్నారు. మన అనుకునే చుట్టాలు మన చుట్టూ వుంటున్నారా? తరతరాలుగా అంతర్లీనంగా అల్లుకున్న వంశవృక్షంలో మనముండే కొమ్మకాక మరొక కొమ్మపై కాలుమోపామా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే మన తరాలను - మూలాల(వంశ వృక్షం)ను వెతుక్కునే ప్రక్రియ. ఒక మనిషికి కష్టం వచ్చినప్పుడు తన అనుకునే నలుగురితో కలిసి వుంటే దాని ప్రభావం చాలా వరకూపోతుందని , అందుకే ఎప్పుడూ ఆటపాటలతో, బంధువులతో కళకళలాడిపోతూ వుండాలని కోరుకునే మధ్యతరగతి మనస్తత్వం గల తండ్రి. అంతేకాక నలుగురితో వున్నప్పుడు - నలుగురిలో వున్నప్పుడు మనం మాట్లాడే మంచి మాటలే సమాజానికి ఎంతో మేలని గట్టిగా నమ్మే వ్యక్తి కధ.

తండ్రి అడుగుజాడల్లో నడిచే కొడుకు - పెద్దాయన వెనకవుండే ముగ్గురు బామ్మరుదులు - ఆయన పెరుగుదల చూసి ఈర్ష్యపడే నాలుగో బామర్ది. తొలి చూపులోనే ప్రేమలో పడినా కుటుంబంతో ఇమడలేకపోతే భవిష్యత్ నరకమని ఆలోచించే ఒక ప్రేమకధ - నచ్చిన వాళ్ళు దక్కకపోవడంతో ప్రపంచం స్తంభించిపోదని - తనలానే ఆలోచించి తనకు మరింత చేరువయ్యే మరో ప్రియురాలు - చివరికి తండ్రి బాటలోనే పయనించి(ఆయన చెప్పులు తొడుక్కుని - స్టెప్ ఇంగ్ ఇన్ ది షూస్) అందరినీ దగ్గర చేసుకునే పుత్రరత్నం... ఇలా ఎన్నో బాహ్యబందాల నేపధ్యంలో మంచిని పెంచి మంచినే ఎప్పుడూ 'విస్తరిం'చాలని కోరుకునే కధ అడ్డాల రాసుకుని వుంటాడు. మనం - మాట్లాడుకున్న దానికంటే పదింతలు ఎక్కువ ఫీల్ తో కధ చెప్పి మహేష్ ని ఒప్పించివుండాలి.

ఎక్కడ కోల్పోయాం?

ఇంత అందమైన కధను అంతకంటే అందంగా తెరకెక్కిస్తేనే అనుకున్న మజా దర్శకుడికి చూస్తున్న మజా ప్రేక్షకుడికి దక్కుతుంది. అయితే కధను వెండితెరపై డీల్ చెయ్యడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. ఉదాహరణకి పైన చెప్పిన కధలో చివర్లో మారిన మహేష్ బాబు అప్పుడే నిజమైన హీరో.. అప్పటివరకూ ఒక మంచి మనుసున్న పెద్దాయన కొడుకు మాత్రమే. కేవలం క్లైమాక్స్ సీన్ లో మాత్రమే హీరో ఎలివేషన్ కి స్కోప్ వుంది. అయితే అప్పటివరకూ ఏమి చెయ్యకుండానే సినిమా మొదట్నుంచి హీరోని డైలాగ్ డైలాగ్ కి ఎత్తేయడం ప్రేక్షకుడు కనెక్ట్ కాలేడు. ప్రపంచమంతా చూడాలన్న హీరోయిన్ - విదేశాల నుండి వచ్చిన హీరోయిన్ తలాతోకా లేని హీరో మాటలకు ఇట్టే పడిపోవడం దగ్గర మరోసారి కనెక్షన్ కోల్పోతాం. ఆవకాయలు పెడుతూ పాటలు పాడుకునే పక్కా నేటీవ్ అంశాన్ని పట్టు చీరలతో గ్లామరస్ గా మార్చడంతో ఫీల్ కలగదు. శ్రీనివాస కల్యాణం సందర్భంగా వధువు వరుడు తరుపున మాట్లాడతారన్న సన్నివేశాన్ని సినిమాటిక్ గా తీసి పాడుచేశారు. దూరంగా వున్నా తోడబుట్టినవాళ్లకు ఇక్కడ కొన్ని కాలల్లోమాత్రమే మనకు దొరికే సీజనల్ ఫ్రూట్స్ ని చూపిస్తూ ఏడిపించే సంఘటన ఎంత నేచురలో తెరపై అదే సీన్ అంత అన్ నేచురల్ గా కనిపిస్తుంది. ఇలా నిజజీవితంలో జరిగే ప్రతీ అంశాన్ని ఎత్తుకున్న రచయిత దర్శకుడిగా మారిన క్రమంలో వాటిని వెండితెరపై అద్దంపట్టలేకపోయాడు.

ఎవరిపై ప్రభావం?

"మనం ఒకరిపక్కన ఉండాలంటే వాళ్ళ పక్కన మనం వుండేంత స్థాయి మనకుండాలి" రెండు మూడు సార్లు చదివితేగానీ అర్ధంగాని ఇటువంటి డైలాగులు శ్రీకాంత్ అలవోకగా సినిమాల్లో వాడేయడంతో ప్రేక్షకుడు ప్రతీ సంభాషణని అర్ధంచేసుకోవడానికే చాలా కష్టపడుతున్నాడు. ఇలాంటి అర్ధంకాని(అర్ధం చేసుకోలేని) సంభాషణలు ఇందులో కోకొల్లలు.

త్రివిక్రమ్ తీసిన ఖలేజా సినిమాను జనం జీర్ణించుకాలేకపోయారు. సుకుమార్ తీసిన 1 పై పెదవి విరిచారు. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల బ్రహ్మోత్సవంపై నిరాశ వ్యక్తం చేసారు. ఎంతో ఎత్తుకి ఎదిగి ఆలోచిస్తే గానీ అర్ధంకాని సినిమాలు కొన్ని, ఏంటో లోతుకి వెళ్లి ఆలోచిస్తేగానీ శాటిస్ఫై అవ్వలేని సినిమాలు మరికొన్ని. భాదాకరమైన విషయం ఏంటంటే ఇవన్నీ మహేష్ బాబే చెయ్యడం. ఖలేజా టి.విలలో చూసే వ80మందికి నచ్చచ్చు - 1 సినిమా తెలివిగా చూసే 10మందికి రుచించచ్చు. బ్రహ్మోత్సవం ఎంతో లోతుగా ఆలోచిస్తేనో ఒకరిద్దరికి అర్ధంకావచ్చు అయితే వీటన్నిటి బాక్స్ ఆఫీస్ రిజల్ట్స్ ఒకటే. తప్పెవరిది? దర్శకుడిదా? మహేష్ దా? ప్రేక్షకుడిదా?