షూటింగ్ లో బిగ్ బికి ప్రమాదం.. ఫ్యాక్చర్?

Sat Aug 12 2017 14:03:27 GMT+0530 (IST)

బాలీవుడ్ మెగాస్టార్.. బిగ్ బి గా అశేష భారతావనికి సుపరిచితులైన అమితాబ్ బచ్చన్ షూటింగ్ లో గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన తగ్స్ ఆఫ్ హిందోస్తాన్ అనే సినిమా చేస్తున్నారు. అమిర్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో అమితాబ్ కూడా నటిస్తున్నారు. తాజా గాయం పెద్దదే అన్న వార్తలు వస్తున్నాయి. గాయం కారణంగా విపరీతమైన నొప్పిని అమితాబ్ అనుభవించారని తెలుస్తోంది.

అయితే.. షూటింగ్ లో ఎలా ప్రమాదం జరిగిందన్న విషయం మీద మాత్రం సమాచారం బయటకు రావటం లేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రమాదంలో పక్కటెముకలు విరిగినట్లుగా తెలుస్తోంది. అయితే.. ప్రమాదం జరిగిన తర్వాత కూడా బిగ్ బి తన షూటింగ్ ను కొనసాగించినట్లుగా చెబుతున్నారు.

షూటింగ్ ముగించుకు వచ్చిన తర్వాత ముంబయికి చేరుకున్న బిగ్ బి.. వైద్యుల సూచనతో స్కానింగ్ చేయించుకున్నారని.. పక్కటెముకల్లో చీలిక చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ కారణంతోనే బిగ్ బికి విపరీతమైన నొప్పికి గురై ఉంటారన్న వాదన వ్యక్తమవుతోంది. విజయ్ కృష్ణా ఆచార్య దర్వకత్వం వహిస్తున్న ఈ చిత్ర బృందం మాత్రం బిగ్ బి ప్రమాదానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఏదీ విడుదల చేయకపోవటం గమనార్హం.