Begin typing your search above and press return to search.

రాజమౌళి గురించి మెగాస్టార్ కామెంట్

By:  Tupaki Desk   |   26 Sep 2016 8:44 AM GMT
రాజమౌళి గురించి మెగాస్టార్ కామెంట్
X
మొన్న ‘ఎం.ఎస్.ధోని’ ఆడియో వేడుకలో రాజమౌళి ప్రసంగం చూస్తేనే అతనెంత హంబుల్ అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మాటను వంద శాతం పాటిస్తాడు జక్కన్న. అంత పెద్ద దర్శకుడైనా.. దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నా.. చాలా ఒద్దికగా ఉంటాడు జక్కన్న. అదే అతణ్ని జనాలు మరింతగా ఇష్టపడేలా చేస్తుంది. స్వయంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సైతం రాజమౌళి వినయ విధేయతల గురించి పొగడ్డం విశేషం.

ఓ ఇంటర్వ్యూలో బాహుబలి గురించి బిగ్-బి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా ట్రైలర్‌.. మేకింగ్‌ వీడియోలను రానా నాకు విడుదలకు ముందే చూపించాడు. అప్పుడే ఈ సినిమా ప్రత్యేకత తెలిసింది. నేను జాతీయ అవార్డుల వేడుకలో రాజమౌళిని చూశా. నా పక్కనే కూర్చున్నాడు. తను చాలా హంబుల్‌ గా ఉన్నాడు. అంత గొప్ప విజువల్‌ వండర్‌ని తీసి అంత వినయంగా కూర్చోవడం చూసి చాలా ఆనందంగా అనిపించింది’’ అని అమితాబ్ బచ్చన్ చెప్పారు.
రాజమౌళి మాత్రమే కాక.. దక్షిణాదిన ఎంతోమంది ప్రతిభావంతులైన దర్శకులున్నారని అమితాబ్ అన్నారు. గత కొన్నేళ్లలో తెలుగు.. ఇతర దక్షిణాది సినిమాల ప్రమాణాలు ఎంతో పెరిగాయని.. వాళ్లు మంచి కథలతో వస్తున్నారని.. టెక్నాలజీ పరంగా చాలా అడ్వాన్స్ అయ్యారని.. మార్కెట్ పరంగా కూడా బాలీవుడ్ తో పోలిస్తే ఇక్కడి పరిశ్రమల విస్తృతి బాగుందని అమితాబ్ కితాబిచ్చారు.