Begin typing your search above and press return to search.

బాలయ్య 'రైతు' కు అమితాబ్ 17 రోజులిచ్చారట!

By:  Tupaki Desk   |   21 Oct 2016 6:28 AM GMT
బాలయ్య రైతు కు అమితాబ్ 17 రోజులిచ్చారట!
X
గతరెండు రోజులుగా టాలీవుడ్ లో విపరీతంగా చర్చించబడుతోన్న విషయం అమితాబ్ తో బాలయ్య అనే అంశం. ఈ విషయానికి సంబందించిన ఫోటోలు విడుదలైనప్పటినుంచీ రకరకాల వార్తలు వచ్చాయి. కేవలం అమితాబ్ ని మర్యాదపూర్వకంగానే బాలకృష్ణ కలిశారని ఒకరంటే... కాదు కాదు బాలయ్య 101 కోసం కలిశారని మరికోందరు అన్నారు. వాటిలో రెండింటిలోనూ కొంతవరకూ వాస్తవం ఉందని తెలుస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం బాలయ్య కృష్ణవంశీతో కలిసి మెగాస్టార్ అమితాబ్ ని కలవడం వెనక అద్భుతమైన విషయం దాగిఉందట!

ప్రస్తుతం సర్కార్ - 3 షూటింగ్ లో బిజీగా ఉన్న అమితాబ్ ని తన 101 సినిమా "రైతు" డైరెక్టర్ కృష్ణవంశ్తీతో కలిసి బాలయ్య ముంబై వెళ్లి అమితాబ్ ని కలిశారు. ఆ సమయంలో బాలయ్యను ఎంతో ఆప్యాయతతో అమితాబ్ దగ్గరకు తీసుకోగా, బాలయ్య పెద్దాయన కాళ్లకు నమస్కారం చేశారు. అయితే ఈ విషయంలో తన 101 వ సినిమాకోసం బాలకృష్ణ అమితాబ్ ని కలిశారని తెలుస్తోంది. ఈ సినిమాలో బాలయ్యది కాకుండా మరో పవర్ ఫుల్ పాత్రది ప్రత్యేక స్థానమట. అయితే ఆ పాత్రకోసం అమితాబ్ అయితే సరిగ్గా సరిపోతారని భావించిన కృష్ణవంశీ - బాలయ్యలు ఆ విషయంపై మాట్లాడటానికే ముంబై వెళ్లారట.

ఈ సమయంలో కృష్ణవంశీ కథను అమితాబ్ కి చెప్పగా ఎంతో ఆనందపడి అభినందించిన బిగ్ బీ... కథ బాగా నచ్చడంతో ఈ సినిమాలో నటించడానికి "ఓకే" చెప్పారంట. అంతే కాకుండా కథ నచ్చడంతో పాటు నందమూరి తారకరామారావు గారిపై ఉన్నా అభిమానం, బాలయ్య సంస్కారం కూడా ఈ సినిమాలో నటించడానికి మరో కారణంగా కూడా చెప్పారట! ఈ సినిమాకోసం అమితాబ్ 17 రోజుల కాల్ షీట్స్ కూడా కేటాయించారట. దీంతో బాలయ్య - కృష్ణవంశీలు ఫుల్ ఖుషీగా ఉన్నారని తెలుస్తోంది.

కాగా అక్కినేని వారి "మనం" , "అమృతవర్షిణి" సినిమాల్లో ఇప్పటికే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కనిపించారు. అయితే దానిలో కథతో బిగ్ బీ కి పెద్దగా సంబందం లేకపోయినా కేవలం ఆయా సినిమాలకు చెందిన పెద్దలతో ఉన్న అనుబంధం మేరకు నటించారు. కానీ మొట్టమొదటి సారిగా తెలుగుసినిమాలో ఒక బలమైన పాత్రలో బిగ్ బీ నటించడం ఇదే తొలిసారి అవుతుంది.