'జన్మదిన' వేడుకలపై బిగ్ బీ వైరల్ పోస్ట్!

Thu Oct 12 2017 19:44:03 GMT+0530 (IST)

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నిన్న తన 75వ జన్మదిన వేడుకలను కుటుంబసమేతంగా మాల్దీవులలో జరుపుకున్న సంగతి తెలిసిందే. అక్కడ అమితాబ్ బచ్చన్ బర్త్ డేను  అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ బచ్చన్ శ్వేతా నందలు `హ్యాపీ బర్త్ డే` ఆంగ్ల అక్షరాలను బాణసంచాతో వెలిగించి బిగ్ బీకి విషెస్ చెప్పారు. అక్కడి  ప్రైవేట్  బీచ్ లో బచ్చన్ కుటుంబ సభ్యులు బర్త్ డే వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. అమితాబ్ తన పుట్టినరోజు వేడుకలను ముంబైలో జరుపుకోకపోవడంపై ఆయన అభిమానులు నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో అమితాబ్ తన బ్లాగ్ లో పుట్టిన రోజు వేడుకల గురించి ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. జన్మదిన వైరాగ్యంతో బిగ్ బీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.
 
బిగ్ బీ తన జన్మదిన వేడుకలపై వైరాగ్యంతో కూడిన పోస్ట్ చేశారు. జీవితం ముగిసిపోయే క్షణంలో ఇటువంటి వేడుకలు జరుపుకోవడం పట్ల అనాసక్తిని ప్రదర్శిస్తూ తన బ్లాగ్ లో ఓ సందేశాన్ని ఉంచారు. ‘75 ఏళ్ల తర్వాత అన్నింటికీ దూరంగా వెళ్లిపోతాం. ఈ వయసులో వేడుకలు జరుపుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. ఎలాంటి దుస్తులు ధరించాలి? ఎవరెవర్ని ఆహ్వానించాలి? వారికి ఏరకమైన మర్యాదలు చేయాలి? అతిథులను ఎలా గౌరవించాలి....ఇలా పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. జన్మదినాన్ని పురస్కరించుకొని హంగులు ఆర్భాటాలు..... జీవితం ముగిసిపోయే క్షణంలో ఇవన్నీ ఎందుకు? మన జీవితంలోని మరో ఏడాదిని కోల్పోతున్నందుకా? నా వాళ్ల మధ్య కూర్చుని వాళ్లు చెప్పే సంగతులు వింటుంటే నన్ను నేనే కోల్పోతున్నాననే భయం కలుగుతోంది..’ అని అమితాబ్ తన బ్లాగ్ లో పోస్ట్ చేశారు.