Begin typing your search above and press return to search.

బిగ్ బికి కోపం వ‌చ్చింది

By:  Tupaki Desk   |   19 March 2018 3:30 PM GMT
బిగ్ బికి కోపం వ‌చ్చింది
X
రీల్ కాదు రియ‌ల్ గానే బిగ్ బికి కోపం వ‌చ్చింది. అయితే.. ఆయ‌న ఆగ్ర‌హాన్ని చూసిన‌ప్పుడు స‌గ‌టు జీవిలానే ఉండ‌టం గ‌మ‌నార్హం. స‌గ‌టు జీవి సంగ‌తే చూద్దాం. త‌మ వ‌ర‌కూ వ‌చ్చే వ‌ర‌కూ ఏ స‌మ‌స్య తీవ్ర‌త అర్థం కాదు. బిగ్ బి ప‌రిస్థితీ అంతే. తాజాగా త‌న‌కొచ్చిన కోపాన్ని ట్విట్ట‌ర్ లో షేర్ చేసుకున్నారు. చ‌ట్టంపై ఫైర్ అయిన ఆయ‌న‌కు అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే.. ఆయ‌న త‌న తండ్రికి సంబంధించిన కాపీ రైట్లు ఇక‌పై ఎలాంటి హ‌క్కు లేద‌న్న మాట‌తో ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంది.

అమితాబ్ తండ్రి ప్ర‌ముఖ ర‌చ‌యిత హ‌రివంశ‌రాయ్ బ‌చ్చ‌న్. ఆయ‌న ర‌చ‌న‌ల మీద 1957 కాపీ హ‌క్కుల చ‌ట్టం మేర‌కు అమితాబ్‌కు 60 ఏళ్ల వ‌ర‌కూ హ‌క్కులు ఉన్నాయి. ఆ త‌ర్వాత ఆయ‌న ర‌చ‌న‌ల మీద ఎలాంటి కాపీ రైట్ ఉండ‌దు. దీనిపై త‌న‌కున్న సందేహాల్ని ట్వీట్ ద్వారా సంధించారు. ఒక వ్య‌క్తికి కాపీ రైట్ 60 ఏళ్ల వ‌ర‌కే ఎందుకు ఉండాలి? 61 ఏళ్ల‌వ‌ర‌కో.. శాశ్వితంగానో ఎందుకు ఉండ‌కూడ‌దు? అంటూ త‌న‌కున్న సందేహాల్ని సంధించారు.

కాపీ రైట్ చ‌ట్టాల్ని చెత్త‌గా అభివ‌ర్ణించిన ఆయ‌న‌.. మేథోప‌ర‌మైన హ‌క్కులు ఎవ‌రు నిర్ణ‌యించారు. తన తండ్రికి తానే వార‌సుడిన‌ని.. ఆయ‌న ర‌చ‌న‌ల‌కు సంబంధించినంత వ‌ర‌కూ హ‌క్కు త‌న‌కే ఉంటుంద‌న్నారు. త‌న తండ్రి మ‌ర‌ణించి 60 ఏళ్లు పూర్తి అయ్యాయి కాబ‌ట్టి.. వాటిపై హ‌క్కులు లేవంటే ఎలా కుదురుతుంది? అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

విలియం షేక్ స్పియ‌ర్.. గురుదేవ్ ర‌వీంద్ర‌నాధ్ ఠాగూర్ లాంటి వారికి వారి కాపీరైట్ హ‌క్కుల గురించి తెలీదు. వారి ర‌చ‌న‌ల‌కు సంబంధించి ఎలాంటి రికార్డులు లేవు. అందుకే వారి ర‌చ‌న‌ల్ని అంద‌రూ వాడుకుంటార‌ని.. దీని కార‌ణంగా వారి నిజ‌మైన వార‌సులకు న‌ష్టం వాటిల్లుతుంద‌న్న అభిప్రాయాన్ని బిగ్ బి వ్య‌క్తం చేశారు.

ఓకే.. ఒక ప‌ని చేస్తే.. ఇప్ప‌టికే ఉన్న చ‌ట్టం ప్ర‌కారం 60 ఏళ్ల వ‌ర‌కు వార‌సులు వాడుకోవ‌చ్చు.. ఆ త‌ర్వాత అదంతా ప్ర‌భుత్వానికి చెందుతుంద‌ని మారిస్తే..? బాగుంటుందేమో? తాత‌ల ఆస్తిని అదే ప‌నిగా ఏళ్ల‌కు ఏళ్లు.. వార‌సులు వాడేసే బ‌దులు.. వారి జీవ‌నానికి సాయం చేసిన స‌మాజానికి కూడా ఎంతోకొంత వాటా ఇస్తే బాగుంటుంది క‌దా?