జీరో నుంచి వేల కోట్లకు ఎదిగిన హీరో

Mon Mar 12 2018 09:39:38 GMT+0530 (IST)

రెండు దశాబ్దాల కిందట అమితాబ్ బచ్చన్ పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. వ్యాపారాల్లో తేడాలు వచ్చి.. నిర్మాణ సంస్థ కూడా నష్టాలు మిగిల్చి.. ఒక సమయంలో ఆస్తులన్నీ కరిగిపోయి చాలా ఇబ్బందికర స్థితికి చేరుకున్నాడు బిగ్-బి. ఆర్థికంగా తన పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని అమితాబే స్వయంగా అప్పట్లో ప్రకటించుకున్నాడాయన. అలాంటివాడు ఇప్పుడు వేల కోట్లకు అధిపతి అంటే ఆశ్చర్యపోవాల్సిందే. రాజ్యసభ సభ్యురాలైన అమితాబ్ భార్య జయా బచ్చన్ ప్రకటించిన ఆస్తుల అఫిడవిట్లో తన పేరటి ఉన్న ఆస్తి విలువ రూ.200 కోట్లని.. అమితాబ్ బచ్చన్ పేరు మీద రూ.800 కోట్ల ఆస్తులున్నాయని పేర్కొనడం విశేషం. వీళ్లిద్దరి ఆస్తుల విలువే రూ.1000 కోట్లన్నమాట.ఇక అభిషేక్ బచ్చన్.. ఇతర కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్న ఆస్తులు.. అన్నింటి మార్కెట్ విలువ లెక్కగట్టి చూస్తే బిగ్-బి కుటుంబం దగ్గర వేల కోట్ల ఆస్తి ఉన్నట్లే. ఒకప్పుడు ఏమీ లేని స్థితికి చేరి ఇప్పుడు ఈ స్థాయికి రావడమంటే ఆశ్చర్యం కలిగించే విషయం. హీరోగా తన కెరీర్ ముగిసిపోయి.. ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితికి చేరుకున్న తరుణంలో బుల్లితెర అని తక్కువగా చూడకుండా ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ కార్యక్రమం చేసి తన కెరీర్ ను కొత్త పుంతలు తొక్కించుకున్నాడు అమితాబ్. ఆ తర్వాత సినిమాల్లో సహాయ పాత్రలకు మళ్లాడు. దీంతో మళ్లీ బిగ్-బికి క్రేజ్ వచ్చింది. అదే సమయంలో ఇబ్బడిముబ్బడిగా ప్రకటనలు వచ్చి పడ్డాయి. ఇలా అన్ని మార్గాల్లో వందల కోట్లు సంపాదించారు. ఆ డబ్బులు పెట్టుబడిగా పెట్టి ఆస్తుల్ని మరింతగా పెంచుకున్నారు. ఈ రోజు వేల కోట్ల అధిపతి అయ్యారు.