అతడితో నిజంగానే కొట్టించుకున్నా

Tue Sep 12 2017 12:26:43 GMT+0530 (IST)

అర్జున్ రెడ్డి మూవీ చాలామంది సినిమా జనాలకే షాక్ ఇచ్చేసింది. మేకర్స్ కూడా ఊహించలేనంత భారీ సక్సెస్ ను జనాలు కట్టబెట్టేశారు. ఈ మూవీలో నటించిన ప్రధాన పాత్రధారులు అందరికీ మంచి పేరు మాత్రమే కాదు.. అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇందుకు కారణం.. ఆయా పాత్రల్లో వారు చూపించిన సహజత్వమే.

అర్జున్ రెడ్డిలో కొద్దిసేపు మాత్రమే కనిపించే పాత్రలో అమిత్ శర్మ నటించాడు. "రేయ్ అమిత్" అంటూ ఫుట్ బాల్ ఆడుతున్న అమిత్ ను హీరో పిలిచే సీన్ ట్రైలర్ లోనే సెన్సేషన్ అయింది. ఆ చిన్న షాట్ ను.. అమిత్ ఎక్స్ ప్రెషన్స్ తో జిఫ్ లు వచ్చేశాయి. నెటిజన్లు ఈ ఎక్స్ ప్రెషన్ ను తెగ షేర్ చేస్తున్నారు. హీరోయిన్ అంటే ఎంతో ఇష్టమని.. ఆమెను ఇంకోసారి ఇబ్బంది పెట్టవద్దంటూ అమిత్ ను హీరో అడిగే సీన్ సూపర్బ్ గా పండింది. లెంగ్తీ సీన్ అయినా సరే.. ఈ షాట్ సింగిల్ టేక్ లో ఓకే అయిందట. ఇందుకు కారణం.. ఆ సన్నివేశంలో తనను నిజంగానే కొట్టాలంటూ విజయ్ దేవరకొండను అడిగాడట అమిత్. అందుకే ఆ సన్నివేశం అంత ఒరిజినల్ గా ఉంటుందని చెబుతున్నాడు.

థియేటర్ ఆర్టిస్ట్ అయిన అమిత్ శర్మకు.. ఓ ఫ్రెండ్ ఈ సినిమా గురించి చెబితే.. దర్శకుడికి ఫోన్ చేసి వేషం అడిగినట్లు చెప్పాడు అమిత్. ఆడిషన్ కోసం  కలిసిన తర్వాత.. 3 గంటల డిస్కషన్స్ అనంతరం.. నా యాటిట్యూడ్ ఈ పాత్రకు సరిగా సరిపోతుందని దర్శకుడు సందీప్ అన్నాడట. తాను.. విజయ్.. షాలినీ పాండే థియేటర్ ఆర్టిస్టులు కావడంతో.. సుదీర్ఘమైన సన్నివేశాలను పండించగలినట్లు అమిత్ శర్మ చెప్పాడు. ప్రస్తుతం ఈ 24 ఏళ్ల కుర్రాడికి.. ప్రభాస్ పక్కన సాహో మూవీలో నటించే అవకాశం వచ్చింది. మరో బడా ప్రాజెక్ట్ కోసం కూడా డిస్కషన్స్ ఫైనల్ దశలో ఉన్నాయట.