క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్లు

Tue Apr 24 2018 13:35:09 GMT+0530 (IST)

హాలీవుడ్ దర్శకుడు హార్వే వీన్‌స్టన్‌పై పలువురు నటీమణులు ఆరోపణలు చేస్తూ క్యాస్టింగ్ కౌచ్‌పై పెద్ద దుమారమే రేపారు. అలా మొదలైన వ్యవహారం తరువాత టాలీవుడ్ పెద్ద వివాదాన్నే సృష్టించింది. శ్రీరెడ్డి ఫిల్మ్ ఛాంబర్ ముందు చేసిన అర్థనగ్న ప్రదర్శనతో జాతీయస్థాయిలో క్యాస్టింగ్ కౌచ్ పై చర్చలు మొదలయ్యాయి. తెలుగు పరిశ్రమలో అయితే ఏకంగా భూకంపాన్నే సృష్టించాయి. మరి బాలీవుడ్ పరిస్థితేంటీ? ఎవరు నోరువిప్పలేదు అనుకుండగానే ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ మాట్లాడారు.ముంబైలో మీడియాతో మాట్లాడిన ఆమె సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఇప్పటిది కాదని ఏనాటి నుంచో ఉందని చెప్పారు. కేవలం ఇండస్ట్రీలోనే కాదు ప్రభుత్వ రంగంలో ఈ పద్దతి ఉందని అన్నారు. క్యాస్టింగ్ కౌచ్‌కు బలవ్వాలా వద్దా అన్నది అమ్మాయిపైనే ఆధారపడి ఉంటుందని అన్నారు. తనలో ప్రతిభ ఉన్నప్పుడు ఒకరికి అమ్ముడవ్వాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. అంతేకానీ ప్రతిదానికి సినిమా ఇండస్ట్రీని నిందించవద్దని... అది మాకు తండ్రితో సమానమని చెప్పారు. గతంలో ఇలియానా డిక్రూజ్ ఈ విషయంపై మాట్లాడుతూ నటీమణులెవరూ ఓపెన్ గా క్యాస్టింగ్ కౌచ్ పై మాట్లాడడానికి ధైర్యం చేయరని అంది. అదే విషయంపై సరోజ్ ఖాన్ మాట్లాడుతూ ఇలియానా చెప్పింది తాను ఒప్పుకుంటానని... ఎవరైనా సినిమా ఇండస్ట్రీలోని క్యాస్టింగ్ కౌచ్ గురించి బయటికొచ్చి మాట్లాడితే వారికిక అవకాశాలు రావని అన్నారు.

సరోజ్ ఖాన్ బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ గా ఉన్నారు. ఆమె డ్యాన్సులకు పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికే ఆమె మూడు సార్లు జాతీయ అవార్డులను అందుకున్నారు. శ్రీదేవి మాధురీ దీక్షిత్ వంటి వారి చేత స్టెప్పులేయించారు. ప్రస్తుతం క్యాస్టింగ్ కౌచ్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలపై ఇంకా ఎవరూ స్పందించలేదు.