Begin typing your search above and press return to search.

ఆ సినిమా నిడివి 720 గంటలు

By:  Tupaki Desk   |   21 July 2017 11:36 AM GMT
ఆ సినిమా నిడివి 720 గంటలు
X
హాలీవుడ్ సినిమాలు చాలా వరకు గంటన్నర నిడివిలో తెరకెక్కుతుంటాయి. మన సినిమాలు సాధారణంగా రెండున్నర గంటలకు అటు అటుగా ఉంటాయి. హాలీవుడ్లో అయినా.. మన దగ్గర అయినా అయినా కథను బట్టి కొన్ని సినిమాలు ఎక్కువ నిడివితో తెరకెక్కుతుంటాయి. ఐతే కథ ఎలాంటిదైనా సరే.. నిడివి 3-4 గంటలకు మించకుండా చూసుకుంటారు ఫిలిం మేకర్స్. అలాంటిది ఒక సినిమా ఏకంగా 720 గంటల నిడివితో తెరకెక్కడం ఎక్కడైనా విన్నారా.. కన్నారా? స్వీడన్‌ కు చెందిన ఆండర్స్‌ వెబెర్గ్‌ అనే దర్శకుడు ఈ సాహసమే చేస్తున్నాడు. ఏకంగా 30 రోజుల నిడివి ఉండేలా అతను ఓ సినిమాను తీర్చిదిద్దుతున్నాడు. మూడు నాలుగు ఏళ్ల నుంచి ఈ చిత్రం చిత్రీకరణ జరుపుకుంటోంది.

ఈ సినిమా పేరు యాంబియన్స్. ఆండర్స్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం విశేషం. ఇందులో వంద మంది దాకా నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రత్యేకంగా కథ.. సంభాషణలు అంటూ ఏమీ ఉండవట. అసలిందులో డైలాగులే ఉండవట. కేవలం దృశ్యాల్ని మాత్రమే చిత్రీకరించి.. వాటికి భారీ స్థాయిలో విజువల్‌ ఎఫెక్ట్స్ జోడించి సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ముందుగా 7 నిమిషాల 20 సెకన్ల నిడివితో ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఏడు గంటల 20 నిమిషాల నిడివితో ఒక ట్రైలర్ లాంచ్ చేశారు. వచ్చే ఏడాది 72 గంటల నిడివితో చివరి ట్రైలర్ రిలీజ్ చేస్తారట. పూర్తి సినిమా 2020లో విడుదలవుతుందట. చిత్రీకరణ పూర్తయ్యాక సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని ఆండర్స్‌ భావిస్తున్నాడు. అన్ని దేశాల్లోనూ ఒకే సమయంలో ప్రదర్శించాలనుకుంటున్నాడు. 30 రోజులపాటు నిరంతరంగా ఈ సినిమాను పద్రర్శిస్తారు. ఒక్కసారి ప్రదర్శన పూర్తయ్యాక మళ్లీ ఈ సినిమాను చూసే అవకాశం ఉండదట. ప్రదర్శన పూర్తయిన తర్వాత ఈ సినిమా ఎవరికీ చిక్కకుండా నాశనం చేయాలని ఆండర్స్‌ భావిస్తున్నాడట.