Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ ఆర్మీ ట్రైనింగ్

By:  Tupaki Desk   |   26 July 2017 9:43 AM GMT
అల్లు అర్జున్ ఆర్మీ ట్రైనింగ్
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ సినిమా డీజీ: దువ్వాడ జగన్నాథమ్ కలెక్షన్లు బాగానే తెచ్చిపెట్టింది. దానికితోడు బోలెడన్ని విమర్శలూ ఎదుర్కొంది. రిలీజ్ కు ముందు ఎన్ని విమర్శలు వచ్చాయో.. రిలీజ్ తర్వాత కూడా అన్ని రావడం విశేషం. సినిమా హిట్ అనిపించుకోవడమే తప్ప ఈ సినిమా బన్నీకి కిక్ ఇచ్చేంత హిట్ కాదనేది కాదనలేని నిజం.

ఈ మూడ్ నుంచి బయటపడి ప్రస్తుతం అల్లు అర్జున్ తర్వాత సినిమా నా పేరు సూర్యపై దృష్టి పెట్టాడు. ఈ సినిమాలో బన్నీ ఆర్మీ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ పాత్రను మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దే పనిలో పడిపోయాడు. ఆర్మీ ఆఫీసర్ పాత్ర అంటే ఏదో మిలట్రీ యూనిఫాంలో కనిపడటంతో సరిపెట్టకుండా ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ముంబయిలో ఉంటూ ఆర్మీ విధుల్లో శిక్షణ పొందుతున్నాడు. తర్వాత ఇదే పనిపై యూఎస్ కూడా వెళ్లనున్నాడు. అక్కడ ఆర్మీ అధికారుల జీవితాన్ని దగ్గర నుంచి పరిశీలించి పోరాటాల్లో వారు అనుసరించే టెక్నిక్స్ నేర్చుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.

టెంపర్ సినిమా రైటర్ వక్కంతం వంశీ ఈ సినిమా తొలిసారిగా డైరెక్టర్ గా మారనున్నాడు. అల్లు అర్జున్ ఫ్యామిలీ సొంత ప్రొడక్షన్ హౌస్ అయిన గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నా పేరు సూర్య సినిమా తెరకెక్కుతోంది. ఇంతకముందు అల్లు అర్జున్ సరైనోడులో ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. ఆ సినిమాలో బన్నీ కొన్ని సీన్లలో మిలట్రీ యూనిఫాంలో కనిపిస్తాడు. అందులో మామూలు ఫైట్లే తప్ప వార్ సన్నివేశాలు అంటూ ఏమీ లేవు. నా పేరు సూర్య కోసం ఇంత ట్రైనింగ్ తీసుకుంటున్నాడంటే ఇందులో వార్ సీన్స్ ఉంటాయని ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.