బన్నీ అక్కడ సిట్టింగ్ వేశాడా?

Mon Jul 17 2017 22:10:56 GMT+0530 (IST)

అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ డీజే.. అనుకున్న స్థాయిలో విజయం సాధించడంలో విఫలం అయింది. భారీ వసూళ్లనే రాబట్టగలిగినా.. సేఫ్ జోన్ లోకి చేరుకోవడం సాధ్యం కాలేదు. దీంతో బన్నీ వరుస విజయాల పరంపరకు బ్రేక్ పడింది. అయితే.. ఇప్పుడు స్టైలిష్ స్టార్ తన నెక్ట్స్ మూవీ పనులు ప్రారంభించేశాడు.

తన సినిమాలకు బాలీవుడ్ టెక్నీషియన్స్ ను తీసుకురావడం ఈ మధ్య బన్నీకి అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతోన్న నా పేరు సూర్య కోసం బాలీవుడ్ సంగీత దర్శక ద్వయం విశాల్-శేఖర్ లతో మ్యూజిక్ ఇప్పిస్తున్నాడు. ప్రస్తుతం వీరితో మ్యూజిక్ సిటింగ్స్ లో తనే స్వయంగా పాల్గొంటున్నాడు అల్లు అర్జున్. తను ఎలాంటి మ్యూజిక్ కోరుకుంటాడో.. అభిమానులు ఎలాంటి సంగీతాన్ని  ఆస్వాదిస్తారో.. తననుంచి ఏమేం కోరుకుంటారనే విషయాన్ని సవివరంగా వివరిస్తున్నాడట బన్నీ. సినిమా కాన్సెప్ట్ కు తగినట్లుగా.. అభిమానులను మెప్పించేలా మ్యూజిక్ ఉండాలన్నది అల్లు అర్జున్ టార్గెట్ గా చెబుతున్నారు. బన్నీతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసిన శేఖర్ 'నీతో కలిసి వర్క్ చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది బ్రదర్' అంటూ కామెంట్ చేశాడు.

విశాల్- శేఖర్ లకు టాలీవుడ్ కొత్తేమీ కాదు. 9 సంవత్సరాల క్రితమే ఓ తెలుగు సినిమాకు పని చేశారు. వెంకటేష్ హీరోగా 2008లో వచ్చిన చింతకాయల రవి  చిత్రానికి సంగీతం ఇచ్చింది వీరే. కాకపోతే అప్పుడు వీరి సంగీతాన్ని పాటల వరకే పరిమితం చేశారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మణిశర్మతో ఇప్పించారు. ఇప్పుడు నా పేరు శివ చిత్రానికి మాత్రం అన్ని బాధ్యతలు వీరే నిర్వహించనున్నారు.