బ్రేకుల్లేని బన్నీ బండి..

Wed Jun 07 2017 15:24:34 GMT+0530 (IST)

మామూలుగా సినిమాకు సినిమాకు గ్యాప్ తీసుకుంటూ ఉంటాడు అల్లు అర్జున్. గత కొన్నేళ్ల నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. సినిమాల మధ్య విశ్రాంతి కోసం కావచ్చు.. స్క్రిప్టు విషయంలో రాజీ పడకుండా మరింత పక్కాగా తీర్చిదిద్దుకోవడానికి దర్శకులకు ఇచ్చే ఫ్రీడమ్ వల్ల కావచ్చు.. ఈ గ్యాప్ వస్తూ ఉంటుంది. ‘దువ్వాడ జగన్నాథం’.. ‘సరైనోడు’.. ‘సన్నాఫ్ సత్యమూర్తి’.. ‘రేసుగుర్రం’.. ఈ సినిమాలన్నింటి ముందూ బన్నీకి గ్యాప్ వచ్చింది. ఐతే తన తర్వాతి సినిమా విషయంలో మాత్రం బన్నీ ఇలా గ్యాప్ తీసుకోవట్లేదని సమాచారం. వక్కంతం వంశీ దర్శకత్వంలో చేయబోతున్న ‘నా పేరు సూర్య’ చిత్రాన్ని వెంటనే మొదలుపెట్టేయబోతున్నాడట.ప్రస్తుతం ‘దువ్వాడ జగన్నాథం’ ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది. షూటింగ్ వర్క్ పూర్తయినప్పటికీ ఇంకా ప్రమోషన్లలో బన్నీ పాల్గొనాల్సి ఉంది. ఈ నెల 23న ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఐతే అంతకంటే ముందే ‘నా పేరు సూర్య’ సెట్స్ మీదికి వెళ్లిపోతుందట. ఈ నెల 21న మంచి ముహూర్తం ఉండటంతో సినిమాను మొదలుపెట్టేస్తారట. బన్నీ కూడా వెంటనే షూటింగ్ లో జాయిన్ అయిపోతాడని సమాచారం. ఈ సినిమాకు స్క్రిప్టు పక్కాగా ఉండటం.. ప్రి ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తయి షెడ్యూళ్లు వేసేయడంతో బన్నీ వెయిట్ చేయాల్సిన అవసరమేమీ రాలేదు. షూటింగ్ నిర్విరామంగా కొనసాగించి.. ఈ ఏడాది ఆఖరుకే సినిమాను రెడీ చేసేయాలని చూస్తున్నారట. వచ్చే ఏడాది వేసవి ఆరంభంలో ‘నా పేరు సూర్య’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/