Begin typing your search above and press return to search.

‘‘అందరికి రౌండప్ ఇచ్చే వెళతా బ్రదర్’’ అంటే ఏంటి బన్నీ

By:  Tupaki Desk   |   19 May 2016 10:14 AM IST
‘‘అందరికి రౌండప్ ఇచ్చే వెళతా బ్రదర్’’ అంటే ఏంటి బన్నీ
X
ఇష్యూ చాలా సింఫుల్. సినిమా ఫంక్షన్లకు వెళ్లినప్పుడు పవర్ స్టార్.. పవర్ స్టార్ అంటూ కొంతమంది మోతాదు మించి అరుస్తున్నారట. దాని వల్ల ఇండస్ట్రీలోని చాలామంది హర్ట్ అవుతున్నారట. ఇదంతా చూసి అల్లు అర్జున్.. అదేనండి మన బన్నీకి ఒళ్లు మండిపోయింది. ఆ మద్యన ఇంటర్వ్యూలలో పవన్ గురించి ప్రస్తావిస్తే.. ఆ ఒక్క విషయం వదిలేయండి బ్రదర్ అని అనటం.. ఆ విషయం మీద సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరగటం తెలిసిన సంగతులే.

ఈ ఇష్యూ మీద వివరణ లాంటి అదేదో(ఒకవేళ వార్నింగ్ లాంటి మాట వాడితే బన్నీకి కోపం వచ్చేయొచ్చు. ఎందుకంటే.. ఆయనిప్పుడు హర్ట్ అయి ఉన్నారు) తరహాలో ఐదు నిమిషాలు మాట్లాడతానని చెప్పి.. ఆ తర్వాత తనకో పది నిమిషాలు కావాలంటూ తాను చెప్పాల్సిందంతా చెప్పేయటం మరో సంగతి. పవర్ స్టార్ అన్న అంశం మీద తాను చెప్పిన మాటలు కాంట్రావర్సీ (ఆ విషయాన్ని బన్నీనే చెప్పారు కాబట్టి కాంట్రావర్సీ అనే ప్రస్తావించటం తప్పు కాదు. లేకపోతే ఆయన హర్ట్ అయ్యే అవకాశం ఉంది) అయిన నేపథ్యంలో తాను చెప్పాలనుకున్న విషయాల్ని చెప్పే వెళతానని ఆవేశం (ఆ మాట అనొచ్చా? లేదంటే భావోద్వేగం అనాలా?.. బన్నీ)లాంటి తరహాలో కాసిన్ని మాటలు అదే.. ఓ పదకొండు నిమిషాల పాటు మాట్లాడేశారు.

తాను చెప్పాలనుకున్నది చెప్పే క్రమంలో బన్నీ నోటి నుంచి ఓ అద్భుతమైన మాట వచ్చింది. అదేమంటే.. ‘‘అందరికి రౌండప్ ఇచ్చే వెళతా బ్రదర్ నమ్ము’’ అని. ఈ మాటకు ముందు ‘పంచ్ డైలాగులు కూడా ఉంటాయి’’ అని కూడా అల్లు అర్జున్ నోటి నుంచి వచ్చింది. తాను హర్ట్ అయిన సందర్భంలో తాను చెప్పాలనుకున్నదంతా చెప్పేయటాన్ని ఎవరూ ఏమీ అనరు. కానీ.. ఆ చెప్పే క్రమంలో.. ‘‘అందరికి రౌండప్ ఇచ్చే వెళతా బ్రదర్.. నమ్ము’’ అని అనటంలో అర్థం ఏమిటో ఒక పట్టాన అర్థం కానిది. ఒకవేళ.. అర్థమైన విషయాన్ని అర్థమైనట్లు చెప్పే ప్రయత్నం చేస్తే.. ఈ మీడియా వాళ్లు కాంట్రావర్సీ చేస్తారంటూ పెద్ద మాటనే మాట్లాడేసిన నేపథ్యంలో.. తాను చెప్పిన ‘‘అందరికి రౌండప్ ఇచ్చే వెళతా బ్రదర్’’ అన్న మాటకు బన్నీనే వివరణ ఇస్తే బాగుంటుందేమో..?