స్వంత ఊరి కోసం బన్నీ నిర్ణయం

Wed Jan 16 2019 12:07:27 GMT+0530 (IST)

గత ఏడాది మేలో విడుదలైన నా పేరు సూర్య తర్వాత ఏకంగా 7 నెలల గ్యాప్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇంకా కొత్త సినిమా మొదలుపెట్టనే లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ ప్రకటించారు కానీ ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు. స్క్రిప్ట్ పనులు ఓ కొలిక్కి రాకపోవడం వల్లే కొంత జాప్యం జరుగుతోందని సమాచారం. మరో వారం పది రోజుల్లో మొదలుపెట్టొచ్చు. ఇదిలా ఉండగా సంక్రాంతి పండక్కు స్వంత ఊరు పాలకొల్లుకు వెళ్లిన బన్నీకి అభిమానులు ఘన స్వాగతం పలికారు. రాజమండ్రి ఎయిర్ పోర్ట్ నుంచి పాలకొల్లు దాకా ఊరేగింపుగా తీసుకెళ్లి బాగా రచ్చ చేసారు.కుటుంబ సమేతంగా వెళ్లిన అల్లు అర్జున్ పాలకొల్లు ఫోటోలు ఆన్ లైన్ బాగా వైరల్ అయ్యాయి కూడా. ఇదిలా ఉండగా స్వంత ఊరికి ఏదైనా చేయాలన్న తలంపు గట్టిగా వచ్చినట్టు ఉంది అల్లు అర్జున్ కి. ఈ ఏడాది అక్కడ ఓ ఫంక్షన్ హాల్ కట్టించబోతున్నట్టు పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయని ప్రకటించేశాడు. తాతయ్య అల్లు రామలింగయ్య పేరు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వచ్చే సంక్రాంతికి సిద్ధం చేస్తారా లేక ఈ సంవత్సరమే ఓపెనింగ్ ఉంటుందా అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఫ్యాన్స్ తో చాలా సమయం గడిపిన బన్నీ తాతయ్య విగ్రహం దగ్గర సైతం హల్చల్ చేసాడు.

ఇదంతా ఓకే కానీ వీలైనంత త్వరగా కొత్త సినిమా కావాలని కోరుతున్నారు ఫాన్స్. ఎలాగూ అరవింద సమేత వీర రాఘవ ఐదు నెలల్లోనే పూర్తి చేసాడు గట్టిగా తలుచుకుంటే బన్నీ సినిమాను దసరాకో దీపావళికో బరిలో దింపవచ్చు. అయితే అది కథను బట్టి బడ్జెట్ ను బట్టి ఉంటుంది. ఇప్పుడైనా స్పీడ్ పెంచి వరసగా సినిమాలు చేయాలనీ కోరుకుంటున్నారు అభిమానులు. కేరళలో కూడా ఫాలోయింగ్ భారీగా ఉన్న బన్నీ నాన్ స్టాప్ గా వెళ్లాలని కోరుతున్నారు.