Begin typing your search above and press return to search.

నా పేరు సూర్య..ఈడ..ఆడ..యాడ పడితే ఆడ

By:  Tupaki Desk   |   21 Jan 2018 6:33 AM GMT
నా పేరు సూర్య..ఈడ..ఆడ..యాడ పడితే ఆడ
X
‘‘నేను తెలుగు భాష లెక్క.. ఈడా ఉంటా ఆడా ఉంటా’’ అంటాడు ‘రుద్రమదేవి’ సినిమాలో అల్లు అర్జున్. హీరోగా ఇప్పుడు అల్లు అర్జున్ రేంజే మారిపోయి.. ఈడా ఆడా మాత్రమే కాక యాడ పడితే ఆడ పాగా వేసేస్తున్నాడు. ఆల్రెడీ కేరళలో బన్నీ పెద్ద హీరోగా ఎదిగిపోయాడు. ఈ మధ్య ఉత్తరాదిన కూడా అతను బాగా పాపులర్ అయ్యాడు. అతడి సినిమాల్ని హిందీలో అనువాదం చేసి రిలీజ్ చేస్తే ఇరగాడేస్తున్నాయి. బన్నీ కొత్త సినిమా ‘నా పేరు సూర్య’పై వేరే భాషల్లోనూ మంచి ఆసక్తి కనిపిస్తోంది. ఈ క్రేజ్ ను పూర్తిగా ఉపయోగించుకోవాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం. బన్నీకి కొత్తగా మార్కెట్ ఏర్పడుతున్న ప్రాంతాల్లోనే కాక.. కొత్త ఏరియాల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు.

తెలుగుతో పాటు మలయాళం.. హిందీ భాషల్లోనూ ‘నా పేరు సూర్య’ను రిలీజ్ చేయాలన్నది మొదట్నుంచి ఉన్న ప్రణాళికే. ఐతే ఇప్పుడు ఇంకో నాలుగు భాషలు తోడవుతున్నట్లు సమాచారం. ఇంకా తమిళం.. మరాఠి.. బెంగాలీ.. భోజ్ పురి భాషల్లోనూ ‘నా పేరు సూర్య’ను రిలీజ్ చేస్తారట. మొత్తంగా ఏడు భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. బన్నీతో మాట్లాడి నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారట. బన్నీ కూడా ఓకే చెప్పాడట. ఐతే ఇంకా షూటింగ్ పూర్తి కాని ఈ చిత్రం ఏప్రిల్ రిలీజ్ డేట్ అందుకుంటుందా అన్న సందేహాలున్నాయి. షూటింగ్ పూర్తి చేయాలి.. పోస్ట్ ప్రొడక్షన్.. ప్రమోషన్ చేయాలి. ఇన్ని పనుల మధ్య ఇన్ని భాషల్లో డబ్బింగ్.. అది కూడా పక్కాగా చేయడమంటే అంత తేలికైన వ్యవహారం కాదు. మరి ‘నా పేరు సూర్య’ టీం ప్లాన్ ఎలా ఉందో? వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ సరసన అను ఇమ్మాన్యుయెల్ నటిస్తోంది. లగడపాటి శ్రీధర్.. నాగబాబు.. బన్నీ వాసు నిర్మాతలు.