Begin typing your search above and press return to search.

అప్పుడు ద్యావుడా. ఇప్పుడు గమ్మునుండువయా

By:  Tupaki Desk   |   10 Oct 2015 5:30 PM GMT
అప్పుడు ద్యావుడా. ఇప్పుడు గమ్మునుండువయా
X
స్టార్ హీరోలు ఓ మాంచి మాస్ డైలాగ్ చెప్పారంటే చాలు.. అది సూపర్ పాపులరైపోతుంది. కొన్నిసార్లు కేవలం డైలాగులే సినిమాల్ని హిట్ చేసేస్తాయి. అందుకే హీరోలకు రాసే డైలాగులు చాలా ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటారు డైరెక్టర్లు. ‘రుద్రమదేవి’ విషయంలో మిగతా క్యారెక్టర్లకు, సన్నివేశాలకు రాసిన డైలాగుల సంగతి వదిలేస్తే అల్లు అర్జున్ చేసిన గోన గన్నారెడ్డి పాత్ర వరకు డైలాగులు పేలిపోయాయి. సినిమా చూసొచ్చిన ప్రేక్షకులంతా గోన గన్నారెడ్డి క్యారెక్టర్ గురించే మాట్లాడుకుంటున్నారంటే.. అందుక్కారణం ఆ పాత్రకు రాసిన పేలిపోయే డైలాగులే కారణం.

ముఖ్యంగా గన్నారెడ్డి పాత్ర పలికే ‘గమ్మునుండువయా’ అనే ఊత పదం సూపర్ పాపులరైంది. ఇంతకుముందు ‘రేసుగుర్రం’ సినిమాలో ‘దేవుడా’ అనే పదాన్ని టిపికల్ స్టయిల్లో ‘ద్యావుడా’ అంటూ పలికి ఆ పదానికి భలే క్రేజ్ తీసుకొచ్చాడు బన్నీ. ఇప్పుడు ‘గమ్మునుండువయా’ కూడా అదే రేంజిలో పేలింది. దీంతో పాటు ‘నా మొలతాడులో తాయత్తు’ అనే డైలాగ్ కూడా భలే పాపులరైంది. సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రకు సంబంధించిన ప్రతి డైలాగ్ కూడా ప్రేక్షకులతో విజిల్స్ కొట్టించింది. ఐతే ఈ గోన గన్నారెడ్డి పాత్ర కోసమే గుణశేఖర్ స్పెషల్ గా ఓ రైటర్ని పెట్టుకోవడం విశేషం. టైటిల్ క్రెడిట్స్ లో మాటల క్రెడిట్ పరుచూరి బ్రదర్స్ తో పాటు విపంచి, రాజసింహ అనే ఇద్దరు రైటర్లకు ఇచ్చారు. ఈ రాజసింహ అనే రైటరే గన్నారెడ్డి పాత్రకు మాటలు రాసింది. అతను మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వాడట. అందుకే స్వచ్ఛమైన తెలంగాణ మాండలికంలో చక్కటి మాటలు రాశాడు.