Begin typing your search above and press return to search.

మారిపోతావా.. చూస్కో బన్నీ

By:  Tupaki Desk   |   18 May 2018 5:30 PM GMT
మారిపోతావా.. చూస్కో బన్నీ
X
కొంచెం భిన్నంగా ఒక కథ ట్రై చేసి ఎదురు దెబ్బ తినగానే ఇక ప్రయోగాలొద్దు బాబోయ్ అన్న నైరాశ్యం మొదలైపోతుంది మన హీరోల్లో. రొటీన్ సినిమాలతో కూడా ఫ్లాపులు ఎదుర్కొన్నపుడు ఇక ఆ టైపు సినిమాలొద్దు కొత్తగా ట్రై చేద్దాం అన్న ఆలోచన మాత్రం రాదు. ఈ కోవలో చెప్పుకోవాల్సిన మొదటి పేరు మాస్ రాజా రవితేజదే. ‘నా ఆటోగ్రాఫ్’.. ‘శంభో శివ శంభో’.. ‘సారొచ్చారు’ లాంటి డిఫరెంట్ సినిమాలు ఆడలేదని.. ఆ తర్వాత ప్రయోగాత్మక కథలకు దూరం అయిపోయాడు రవితేజ. అందుకే ఎప్పుడూ రెగ్యులర్ మాస్ సినిమాలే చేస్తుంటాడు. కానీ ఆ సినిమాలతో కూడా అప్పుడప్పుడు మాస్ రాజాకు చుక్కలు కనిపిస్తుంటాయి. అందుకు తాజా ఉదాహరణ ‘టచ్ చేసి చూడు’.

రవితేజ మాత్రమే కాదు.. టాలీవుడ్లో మరికొందరు పెద్ద హీరోలు కూడా అతడిలాగే మాట్లాడుతుంటారు. గత కొన్నేళ్లలో మహేష్ బాబు చేసిన కొన్ని ప్రయోగాలు బెడిసి కొట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘భరత్ అనే నేను’ ప్రమోషన్లలో భాగంగా మాట్లాడుతూ ప్రయోగాలు చేసి చేసి అలసిపోయానని.. ఇక అభిమానులకు నచ్చే కమర్షియల్ సినిమాలే చేస్తానని అన్నాడు. కానీ మహేష్ నుంచి నిజంగా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు ఎవ్వరూ ఆశించరు. ఆ మాటకొస్తే మహేష్ ను మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కించిన‘భరత్ అనే నేను’ వైవిధ్యమైన సినిమానే. కాబట్టి మహేష్ ఆలోచన మార్చుకోవాల్సిందే.

ఇక టాలీవుడ్లో ప్రయోగాల జోలికెళ్లనంటున్న మరో స్టార్ హీరో అల్లు అర్జున్ అని వార్తలొస్తున్నాయి. ‘నా పేరు సూర్య’తో డిఫరెంటుగా ట్రై చేసి ఎదురు దెబ్బ తిన్నాడు బన్నీ. దీంతో ఈసారి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ చేయాలనుకుంటున్నాడని.. కొత్త కథలు వద్దంటున్నాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే విక్రమ్ కుమార్ సినిమాను పక్కన పెట్టాడని కూడా అంటున్నారు. కానీ ముందు ‘నా పేరు సూర్య’ ఆడకపోవడానికి కారణాలేంటో చూడాలి. ఏదైనా కొత్తగా చేశాం అంటే సరిపోదు. అది పర్ఫెక్టుగా ఉండాలి. అది లేనపుడు కేవలం కొత్తగా ట్రై చేశాం కాబట్టే సినిమా ఆడలేదనుకుంటే పొరబాటు. ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి మారింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్ని ఆదరించే పరిస్థితి లేదు. కొత్త కథలు ఎంచుకుంటూనే వాటిని వినోదాత్మకంగా చెబుతూ జనాల్ని అలరించే ప్రయత్నం చేయాలి. అలాంటి సినిమాలకే భారీ విజయాలు దక్కుతాయి. ఆ విషయాన్ని చాలా సినిమాలు రుజువు చేశాయి. కాబట్టి కొత్తదనం వద్దనే నిర్ణయానికి వస్తే కష్టం. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు ఎలాంటి ఫలితాలొస్తున్నాయో కూడా చూసుకుని బన్నీ నిర్ణయం తీసుకుంటే బెటర్.