Begin typing your search above and press return to search.

యూట్యూబ్ మెగాస్టార్ అవుతున్నాడే

By:  Tupaki Desk   |   16 July 2018 12:43 PM GMT
యూట్యూబ్ మెగాస్టార్ అవుతున్నాడే
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు ఎక్కడో సుడి ఉంది. లేకపోతే టాలీవుడ్ లో ఓ రేంజ్ లో ఫాన్ ఫాలోయింగ్ ఉండగా కేరళలో సైతం మల్లు ఫాన్స్ తో పిచ్చ క్రేజ్ సంపాదించుకున్న బన్నీ యూట్యూబ్ లో కూడా ఎవరికి అందని రికార్డ్స్ సృష్టిస్తూ బాలీవుడ్ ఖాన్లకు సైతం కొరుకుడు పడని కొత్త శిఖరాలు అందుకుంటున్నాడు. తాజాగా సరైనోడు హిందీ వెర్షన్ ద్వారా యూట్యూబ్ లో 200 మిలియన్లు కౌంట్ దాటేసి ఇండియన్ ఫిలిం హిస్టరీలో ఒక ఫుల్ లెంగ్త్ సినిమాకు ఏ హీరోకు రానన్ని వ్యూస్ సాధించి అందరిని నోరెళ్ళబెట్టేలా చేస్తున్నాడు. అమితాబ్ మొదలుకుని అమీర్ ఖాన్ దాకా చరిత్ర సృష్టించిన సినిమాలకు సైతం ఇందులో సగం వ్యూస్ కూడా దక్కలేదు. అలాంటిది సౌత్ నుంచి డబ్ అయిన ఒక మసాలా కమర్షియల్ ఎంటర్ టైనర్ అందులోనూ అరగంట పాటు కత్తెర వేసి ఆన్ లైన్ లో విడుదల చేస్తే అది కూడా ఒక ఏడాది లోపే ఇంతటి సంచలనం నమోదు చేయటం చూసి బన్నీ ఫాన్స్ సంతోషం ఓ రేంజ్ లో లేదు.

ఇదేమి బాహుబలి లాంటి విజువల్ వండర్ కాదు. దంగల్ లాగా స్ఫూర్తి ఇచ్చింది లేదు. భాగ్ మిల్కా భాగ్ తరహాలో బయో పిక్ కాదు. మరి నార్త్ ప్రేక్షకులు దీన్ని ఎందుకు ఇంతగా ఆన్ లైన్ లో ఎగబడి చూస్తున్నారు అంటే దానికి కారణం ఇందుల్పో బోయపాటి చూపించిన మాస్ మసాలాతో పాటు అల్లు అర్జున్ పెర్ఫార్మన్స్ వాళ్లకు బాగా కనెక్ట్ అయిపోయింది. మరోవైపు దువ్వాడ జగన్నాథ్ కూడా 175 మిలియన్ వ్యూస్ తో రేస్ లో ఉండగా సన్ అఫ్ సత్యమూర్తి తో పాటు జులాయి కూడా లైన్ లో ఉన్నాయి. ఈ లెక్కన అల్లు అర్జున్ ని యూట్యూబ్ మెగాస్టార్ అన్నా ఆశ్చర్యం లేదు. ఈ రికార్డుల వల్లే తెలుగు సినిమాలు షూటింగ్ లో ఉండగానే వాటి తాలూకు హిందీ డబ్బింగ్ వెర్షన్లకు విపరీతమైన డిమాండ్ వచ్చి పడుతోంది. ఇది ఒక రకంగా ఆదాయ వనరుగా మారుతోంది. ఈ క్లబ్బులో డీజే కూడా జాయిన్ అయితే అల్లు అర్జున్ ని ఆన్ లైన్ రికార్డ్స్ లో పట్టుకోవడం కష్టమేనేమో.