బన్నీ త్రివిక్రమ్ లు గట్టిగా ఫిక్స్ అయ్యారట

Wed Jun 12 2019 15:08:22 GMT+0530 (IST)

ఇప్పటికే ఏడాది పైగా గ్యాప్ వచ్చిన నేపధ్యంలో అల్లు అర్జున్ తన కొత్త సినిమాల విషయంలో వడివడిగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్ సినిమా షూటింగ్ రెండో షెడ్యూల్ శరవేగంగా జరుగుతోంది. ఒక కంపెనీలో పని చేస్తున్న బన్నీ-నవదీప్-రాహుల్ రామకృష్ణ - పూజా హెగ్డేల మీద సన్నివేశాలను తెరకెక్కించడంలో మాటల మాంత్రికుడు బిజీగా ఉన్నాడు. ఒక్కొక్కరుగా షూట్ లో జాయిన్ అవుతున్నారు.ఇటీవలే నివేత పెతురాజ్ తోడవ్వడం మరో ఆకర్షణను జోడించింది. ఇదిలా ఉండగా విడుదల విషయంలో బన్నీ త్రివిక్రమ్ లు ఏకాభిప్రాయానికి వచ్చారట. ఎంత పోటీ ఉన్నా సరే ఖచ్చితంగా 2020 సంక్రాంతికి విడుదల చేయాలనే టార్గెట్ తో  ఇకపై పనులు మరింత వేగవంతం చేయబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే రేస్ లో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు- బాలకృష్ణ క్రాంతి(ప్రచారంలో ఉన్న టైటిల్) కర్చీఫ్ లు వేయగా ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఈ రేస్ లో చేరబోతున్నాడు.

ప్రకటించడానికి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి పేరు డిసైడ్ చేశాక అనౌన్స్ మెంట్ చేస్తారు. గతంలో భరత్ అనే నేను-నా పేరు సూర్యకు క్లాష్ వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు బన్నీ నిర్మాతలే వెనక్కు తగ్గి ఓ వారం వాయిదా వేసుకున్నారు. కాని ఇప్పుడా ఛాన్స్ లేదు. సంక్రాంతి ఎలాగూ ముగ్గురు నలుగురు స్టార్ హీరోల సినిమాలను అకామిడేట్ చేస్తుంది కాబట్టి పోటీ గురించి ఆలోచించాల్సిన పని లేదని పక్కాగా ఫిక్స్ చేసుకున్నారట.