Begin typing your search above and press return to search.

అమెజాన్ నెట్ ఫ్లిక్స్ డ్యామేజికి విరుగుడు మంత్రం!

By:  Tupaki Desk   |   14 Oct 2019 4:49 AM GMT
అమెజాన్ నెట్ ఫ్లిక్స్ డ్యామేజికి విరుగుడు మంత్రం!
X
గతంలో హిట్ సినిమా అంటే ఆ సినిమాతో ముడిపడి ఉన్న అందరికీ లాభాలు వచ్చేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. హిట్ అయినా అందరికీ లాభాలు తీసుకొస్తుందన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే ఒక సినిమాకు లాంగ్ రన్ ఉంటేనే బయ్యర్లందరూ లాభాల్లోకి వస్తారు. కానీ పలు కారణాల వల్ల సినిమాలకు లాంగ్ రన్ తగ్గిపోయింది. నాలుగు రోజులు కలెక్షన్స్ నిలకడగా ఉండడం లేదు. దీనికి పలు కారణాలు ఉన్నాయి. వాటిలో ఎక్కువగా నష్టం చేస్తున్నది మాత్రం డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ అయిన అమెజాన్.. నెట్ ఫ్లిక్స్.

డిజిటల్ రైట్స్ రూపేణా కోట్లు వస్తున్నాయి కదా అని మొదట్లో నిర్మాతలు సంతోషపడ్డారు కానీ దాని దుష్ఫలితాలు మెల్లగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే టికెట్ల ధరలు.. మల్టిప్లెక్సుల్లో ఖర్చుకు బెంబేలెత్తుతున్న మెజారిటీ ప్రేక్షకులు సినిమా 'అద్భుతః' అంటే తప్ప థియేటర్ కు రావడం లేదు. ఇక రిపీట్ ఆడియన్స్ దాదాపు జీరో అయ్యారు. మొదటి నుంచే పరిస్థితి ఇలా ఉంటే గత కొన్నేళ్ళుగా వచ్చిన అమెజాన్ లాంటి ప్లాట్ ఫామ్స్ వల్ల ఇంట్లోనే కూర్చుని హాయిగా సినిమాను ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూసే సౌలభ్యం కలుగుతోంది.

దాదాపు ఎక్కువ మంది ఇళ్ళలో హై-ఎండ్ టీవీలు ఉండడం.. ఒక ఫ్యామిలీ మల్టి ప్లెక్స్ కు వెళ్లి సినిమా చూసే ఖర్చు ఏడాది అమెజాన్ సబ్ స్క్రిప్షన్ ఫీజుకు సమానం కావడంతో ఎక్కువమంది థియేటర్లకు వెళ్ళడం మానుకుంటున్నారు. పైగా సినిమాను నెల లోపు.. మహా అంటే రెండు నెలల లోపు అమెజాన్ లో అందుబాటు లో ఉంచడం థియేటర్ల కలెక్షన్లకు గండి కొడుతోంది. సినిమాను తప్పనిసరిగా థియేటర్లోనే చూడాలి అనుకునే ఉత్సాహవంతులు తప్ప మిగతా సాధారణ జనాలు అందరూ 'నాలుగు రోజులు ఆగితే అమెజాన్ లో వస్తుంది కదా.. ఇప్పుడు అవసరమా' అనే ఆలోచనతో థియేటర్ కు వెళ్ళడం మానేస్తున్నారు. ఈ మధ్య ఓవర్సీస్ మార్కెట్ దారుణంగా దెబ్బతినడానికి ఇలాంటి స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ ఒక కారణమనే వాదన ఉంది.

దీంతో మన నిర్మాతలు కూడా ఈ సమస్యకు పరిష్కారం దిశ గా అడుగులు వేస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్ కు 50 రోజుల తర్వాతే స్ట్రీమింగ్ చేసేలా కొత్త సినిమాలకు ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. తాజగా 'అల వైకుంఠపురములో టీమ్ మరింత ముందడుగు వేసి "మీరు ఈ సినిమాను అమెజాన్ లోనూ.. నెట్ ఫ్లిక్స్ లోనూ చూడలేరు" అంటూ పోస్టర్ పైనే ముద్రించారు. ఈ పోస్టర్ ఓవర్సీస్ ఆడియన్స్ కు సంబంధించినది కావడం గమనార్హం. రిలీజ్ డేట్ కూడా జనవరి 11 అని ఉండడం మీరు గమనించవచ్చు. అంటే ప్రేక్షకుల మైండ్ సెట్ మార్చి థియేటర్లకు రప్పించే ప్రయత్నాలు మొదలయ్యాయన్నమాట. డిజిటల్ రైట్స్ ద్వారా వచ్చే ఆదాయం కంటే థియేట్రికల్ కలెక్షన్స్ రూపంలో నష్టపోయేది ఎక్కువగా ఉందన్న వాస్తవం ఇప్పటికి టాలీవుడ్ ఫిలిం మేకర్లకు అర్థం అయినట్టుంది. మరి ఈ అమెజాన్.. నెట్ ఫ్లిక్స్ లకు వేస్తున్న విరుగుడు మంత్రం పనిచేస్తుందా లేదా అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.