అల్లు వారి నోట పవన్ కళ్యాణ్ మాట

Mon Jan 22 2018 00:30:09 GMT+0530 (IST)

కొన్నేళ్ల నుంచి అల్లు అరవింద్.. పవన్ కళ్యాణ్ మధ్య అంత మంచి సంబంధాలున్నట్లుగా కనిపించడం లేదు. ఒకరి గురించి ఒకరు మాట్లాడటమే అరుదైపోయింది. ప్రజా రాజ్యం  పార్టీ వైఫల్యానికి సంబంధించి అల్లు అరవింద్ పాత్ర కీలకమన్న అభిప్రాయంతో పవన్ ఉన్నాడన్న సందేహాలు చాన్నాళ్ల నుంచి ఉన్నాయి. ఈ మధ్య ఒక సభలో ఆ విషయాన్ని పరోక్షంగా చెప్పకనే చెప్పాడు పవన్. మరోవైపు అల్లు అర్జున్ కు.. పవన్ కళ్యాణ్ అభిమానులకు మధ్య రెండేళ్లుగా నడుస్తున్న యవ్వారం సంగతీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య అంతరం మరింత పెరిగిందనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇంతకుముందులా ఒకరి గురించి ఒకరు మాట్లాడటం బాగా తగ్గిపోయింది.ఇలాంటి తరుణంలో అరవింద్ ‘తొలి ప్రేమ’ ఆడియో వేడుకలో పవన్ పేరు ఎత్తడం ఆసక్తి రేకెత్తించింది. 20 ఏళ్ల కిందట ‘తొలి ప్రేమ’ సంచలన విజయం సాధించి పవన్ కళ్యాణ్ కు చాలా మంచి పేరు తెచ్చిపెట్టిందని.. ఇప్పుడు ‘తొలి ప్రేమ’ పేరుతో వస్తున్న కొత్త సినిమా వరుణ్ తేజ్ కు కూడా అంతే మంచి పేరు తెచ్చిపెడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. అల్లు పవన్ పేరు ఎత్తినపుడు ఆడిటోరియం హోరెత్తిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక వరుణ్ గురించి ఆయన చెబుతూ.. ‘కంచె’ సినిమాలో అతడి నటన చూసి ఆశ్చర్యపోయానన్నారు. తన మనసుకు నచ్చి ఆ సినిమా చేశానని వరుణ్ అన్నపుడు సంతోషం కలిగిందని.. వైవిధ్యమైన పాత్రలు చేయాలన్న తపన అతడిలో ఉందని.. అతడిని చూస్తుంటే తన ముందు పెరిగిన వరుణేనా ఇతను అనిపిస్తూ ఉంటుందని అరవింద్ అన్నాడు.